జలదిగ్బంధంలో ఆదిలాబాద్ జిల్లా

August 17, 2018


img

గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న బారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలో పలుప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా సుమారు 1.20 లక్షల ఎకరాలలో వేసిన పత్తి, సోయాబీన్ పంటలు నీట మునిగాయి. అనేక గ్రామాలలో వందలాది ఇళ్ళు కూలిపోయాయి. హైదరాబాద్‌ వంటి మహానగరంలో 9-10 సెంటీమీటర్లు వర్షపాతం కురిస్తేనే రోడ్లన్నీ జలమయం అవుతాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడలో ఏకంగా 21.6 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.   

జిల్లాలో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గ్రామాలలో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో ఆ ధాటికి అనేక ప్రాంతాలలో రోడ్లు కొట్టుకుపోయాయి. జైనథ్ మండలంలోని తరోడ గ్రామం వద్దగల రోడ్డు కొట్టుకుపోయింది. ఆకారణంగా పక్కనే వంతెన ఉన్నప్పటికీ ప్రజలు దానిపైకి చేరుకోలేకపోతున్నారు. ఒకపక్క పెన్ గంగ నది, మరోపక్క కండ్రివాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో బేల, తాంసి, జైనథ్, బొధ్ మండలాలలో గ్రామాలన్నీజలదిగ్బంధం అయ్యాయి. 

ఇక కుంటాల, పొచ్చెర జలపాతాలలో చాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. బారీ వర్షాల కారణంగా సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులలోకి బారీగా వరదనీరు వచ్చి చేరడంతో కొన్ని గేట్లు ఎత్తివేసి నీటిని క్రిందకు విడుదల చేస్తున్నారు. 

ఇక కుమురం భీం జిల్లాలో కూడా ఇంచుమించు ఇవే పరిస్థితులు నెలకొనున్నాయి. జిల్లాలో దహేగాం మండలంలోని ఎర్రవాగు పొంగిపొర్లుతుండటంతో 11 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొన్నాయి. జన్నారం మండలంలోని అప్రోచ్ రోడ్ కొట్టుకుపోవడంతో మంచిర్యాలకు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల మద్య రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. నిర్మల్ జిల్లాలో కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టులలోకి ఎగువనుంచి బారీగా నీళ్ళు వచ్చి చేరుతుండటంతో మూడు ప్రాజెక్టులలో గేట్లను ఎత్తివేసి నీటిని క్రిందకు వదులుతున్నారు. 


Related Post