నేటితో ముగియనున్న మహాసంప్రోక్షణం

August 16, 2018


img

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతీ 12 ఏళ్ళకు ఒకసారి చేపట్టే మహాసంప్రోక్షణం కార్యక్రమం గురువారం సాయంత్రానికి ముగియనుంది. కనుక రేపు తెల్లవారుజాము నుంచి మళ్ళీ యధాప్రకారం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. శుక్రవారం నుంచి అన్నీ ఆర్జితసేవలు పునః ప్రారంభం అవుతాయి. వాటికోసం టీటీడీ మళ్ళీ టికెట్లు విక్రయించడం మొదలుపెట్టింది. 

మహాసంప్రోక్షణం సమయంలో కూడా రోజుకు 25-30,000 మంది వరకు భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తూనే ఉన్నారు. నిన్న 29,861 మండి భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ్ళ 35,000 మంది భక్తులకు అనుమతిస్తారు. వృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డల తల్లులు వారి సహాయకులకు ఈరోజు ఉదయం శ్రీవారి ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు.

మహాసంప్రోక్షణకు ముందు స్వామివారి ఆలయంతో సహా పరిసర ఆలయాలలో కొలువైన దేవాతామూర్తులను కలశాలలోకి ఆవహింపజేసి వాటికి నిత్యపూజలు చేశారు. ఈరోజు ఉదయం కలశాలలో ఉన్న ఆ శక్తులను మళ్ళీ దేవతామూర్తుల విగ్రహాలలోకి ప్రవేశింపజేసి ప్రాణప్రతిష్ట చేసే ‘ఆధివాసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈరోజు ఉదయం 10.16 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల లోపుగా తుల లగ్నంలో మహా సంప్రోక్షణం కార్యక్రమం జరుగుతుంది. అదే సమయంలో ఆనంద నిలయంలో ఏర్పాటు చేసిన 28 హోమగుండాలలో పూర్ణాహుతి జరుగుతుంది. అనంతరం కళావాహనం అనే కార్యక్రమం నిర్వహిస్తారు. దీనితో మహా సంప్రోక్షణం కార్యక్రమం పూర్తవుతుంది. 

ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు గరుడవాహనంపై, మళ్ళీ రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై  స్వామివారిని ఊరేగిస్తారు. రేపు తెల్లవారుజాము సుప్రభాతసేవతో మళ్ళీ అన్నీ ఆర్జితసేవలు మొదలవుతాయి. మళ్ళీ నిరాటంకంగా భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చు.


Related Post