కేటీఆర్ గురించి పవన్ కళ్యాణ్ ఎమ్మన్నారంటే..

August 16, 2018


img

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం హైదరాబాద్‌లోని తన పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలలో నుంచి వచ్చినవాడే నిజమైన నాయకుడు. మంత్రి కేటీఆర్ అటువంటి వ్యక్తే. ఆయన తెలంగాణా ఉద్యమాలలో పాల్గొని నాయకుడిగా ఎదిగారు. అధికారం చేపట్టిన తరువాత కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ అందరి మెప్పు పొందుతున్నారు. కనుక ఆయనకు ఎప్పటికైనా ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది. కానీ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ దొడ్డి దారిలో మంత్రిగా అయ్యారు. ఏనాడూ ప్రజలలోకి వెళ్ళి వారి కష్టాలు తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. వారసత్వంతోనే మంత్రి అయ్యారు. వారసత్వంతోనే ముఖ్యమంత్రి కూడా అవ్వాలనుకొంటున్నారు. ఆయనకు ఏమి అర్హత ఉందని ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారు?” అని ప్రశ్నించారు. 

తెలంగాణాలో జనసేన పార్టీని విస్తరించడం గురించి మాట్లాడుతూ, “నాకు తెలంగాణా అంటే చాలా అభిమానం. ఇక్కడ కూడా దశలవారీగా పార్టీని విస్తరిస్తాము. తెలంగాణాలో బలం ఉన్నచోట వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తాము. ఇతర ప్రాంతాలలో ప్రజలను ప్రభావితం చేసేందుకు కృషి చేస్తాము. అదిలాబాద్ జిల్లాలో మారుమూల తండాలకు వెళ్ళి అక్కడి ప్రజల కష్టాలను తెలుసుకొన్నాను. మా పార్టీ రూపొందించిన విజన్ డాక్యుమెంట్ లో తెలంగాణాకు సంబందించిన అంశాలు కూడా చేర్చి ఉంటే నేను చాలా సంతోషించి ఉండేవాడిని,” అని చెప్పారు.

ముస్లింలు, గోవధ గురించి మాట్లాడుతూ, “ముస్లింలను మైనార్టీలని అనడం నేను అంగీకరించను. అందరిలాగే వారు కూడా భారతీయులు. వారికీ సమానహక్కులు ఉన్నాయి. కొందరికి ‘బీఫ్’ ఒక ఆహార పదార్ధం. కనుక గోవధపై రాజకీయం చేయడం తగదు,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.


Related Post