రాష్ట్రానికి మల్కాపూర్ ఆదర్శం: కెసిఆర్

August 15, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో కంటివెలుగు పధకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగసభలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో చాలా మంది ప్రజలు కంటివ్యాధులతో బాధపడుతున్నారు. కానీ కంటి పరీక్షలు, చికిత్స చేయించుకొనే స్థోమతలేనివారు అలాగే నానా బాధలు పడుతున్నారు. కనుక రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు, కళ్ళజోళ్ళు అందించాలనే ఉద్దేశ్యంతో దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణా రాష్ట్రంలో ఈ కంటి వెలుగు పధకాన్ని ప్రారంభిస్తున్నాము. అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా చేయిస్తాము. దృష్టిలోపాలు ఉన్నవారికి పంపిణీ చేసేందుకు 40 లక్షల    కళ్ళద్దాలు తెప్పించి సిద్దంగా ఉంచేము. రాష్ట్ర ప్రజలు అందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుందని నేను నమ్ముతున్నాను. అందుకే ఈ పధకాన్ని అమలుచేస్తున్నాము,” అని అన్నారు. 

ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డిని సిఎం కెసిఆర్‌ సభాముఖంగా ప్రశంసించారు. ఇక జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, పాడిపశువులు, రోడ్లు, మండలంలో జిమ్ సెంటర్, గ్రంధాలయం నిర్మాణం కోసం అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేస్తానని జిల్లా కలెక్టర్, స్థానిక నేతలు, గ్రామపెద్దలు అందరూ మాట్లాడుకొని ఆ డబ్బుతో తమకు కావలసినవన్నీ నిర్మించుకోవాలని, ఏర్పాటు చేసుకోవాలని కోరారు. మల్కాపూర్ గ్రామంలో ఒక్కో ఇంటికి రెండు పాడిపశువులను కొనుగోలు చేసుకోవాలని, ఈ విషయంలో గ్రామస్తులే తమకు కావలసినవాటిని కొనుగోలు చేసుకోవాలని సిఎం కెసిఆర్‌ చెప్పారు. అందుకు అవసరమైన సొమ్మును జిల్లా కలెక్టర్ వద్ద అందుబాటులో ఉంచుతానని చెప్పారు. 

మల్కాపూర్ గ్రామస్తులు సమిష్టిగా తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకొంటూ, చుట్టుపక్కల వేలాదిమొక్కలను పెంచడం తనకు చాలా సంతోషం కలిగిస్తోందని సిఎం కెసిఆర్‌ అన్నారు. మల్కాపూర్ గ్రామం రాష్ట్రంలో అన్నీ గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోందని సిఎం కెసిఆర్‌ ప్రశంసించారు. ఈ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి చాలా సంతృప్తిగా హైదరాబాద్‌ తిరిగి వెళుతున్నాను,” అని సిఎం కెసిఆర్‌ అన్నారు.


Related Post