సెప్టెంబర్ 25 నుంచి ఆయుష్మాన్ భారత్ పధకం షురూ

August 15, 2018


img

72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ డిల్లీలోని ఎర్రకోటలో జెండా ఆవిష్కరణ చేసి దేశప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించారు. స్వాతంత్ర్యం వచ్చి 71 సంవత్సరాలు గడిచినప్పటికీ దేశం ఇంకా అన్నీ రంగాలలో వెనుకబడి ఉండటం తనకు చాలా బాధ కలిగిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. దేశాభివృద్ధి కోసం, దేశప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలపై, చేపడుతున్న అభివృద్ధి పనులపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ముందుకే సాగుతున్నామని, ప్రపంచంలో అగ్రదేశాల సరసన భారత్ ను నిలపడమే తన లక్ష్యమని ప్రధాని మోడీ చెప్పారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోడీ ‘ఆయుష్మాన్ భారత్’ పధకాన్ని ప్రారంభిస్తునట్లు ప్రకటించారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి సందర్భంగా వచ్చే నెల 25వ తేదీ నుంచి ఈ పధకం అమలులోకి వస్తుందని తెలిపారు. దేశంలో పేదప్రజలకు అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులోకి  తెచ్చేందుకు ఉద్దేశ్యించిన పధకం ఇది. ఈ పధకం ద్వారా తొలివిడతలో సుమారు 10 కోట్ల మంది పేదప్రజలకు పూర్తి ఉచితంగా అన్ని రకాల వైద్య సేవలు లభిస్తాయి. దీని అమలుకోసం ప్రత్యేక వ్యవస్థను యంత్రాంగాన్ని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ పధకం పూర్తిస్థాయిలో అమలైతే దాదాపు 50 కోట్ల మందికి ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అప్పుడు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆరోగ్యభీమా పధకం ఇదే అవుతుందని ప్రధాని మోడీ తెలిపారు. 

ఈ పధకంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే 80 శాతం పూర్తయిందని చెప్పారు. ప్రజల ఆర్ధిక, సామాజిక పరిస్థితుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని, వారికి ‘క్యూఆర్ కోడ్’ ఉన్న పత్రాలను అందజేస్తున్నామని తెలిపారు. 

ఈ పధకంలో ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీలు, మోకాలు చిప్ప మార్పిడితో సహా మొత్తం 1,354 రకాల చికిత్సలకు పూర్తి ఉచితంగా వైద్యసేవలు లభిస్తాయని ప్రధాని మోడీ తెలిపారు. ఈ పధకం ద్వారా పేద ప్రజలు తమ ప్రాంతాలలో ఉండే 10 పడకలున్న ఆసుపత్రుల మొదలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు ఎక్కడైనా ఉచిత వైద్య చికిత్స పొందవచ్చని తెలిపారు. ఈ పధకాన్ని రాష్ట్రాలు తమకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకొనే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. ఈ పధకానికి కేంద్రప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లిస్తుందని ప్రజలు ఒక్క పైసా చెల్లించనవసరం లేదని ప్రధాని మోడీ చెప్పారు. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ పధకం ప్రారంభం అవుతుందని ప్రధాని మోడీ చెప్పారు.


Related Post