మోడీ, కెసిఆర్ దొందూ దొందే: రాహుల్

August 13, 2018


img

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం సాయంత్రం శేరిలింగంపల్లిలో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోడీ,సిఎం కెసిఆర్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. మోడీ, కెసిఆర్ ఇద్దరూ మాయమాటలు చెపుతూ ప్రజలను మభ్యపెడుతున్నవారేనని విమర్శించారు. 

“తాను ప్రధానమంత్రినయితే దేశంలో ప్రతీ ఒక్క పౌరుడి ఖాతాలో రూ.15లక్షలు జమా చేస్తానని, కోటి ఉద్యోగాలు కల్పిస్తానని, దేశ సంపదకు కాపలాదారులా ఉంటానని మోడీ చెప్పారు. కానీ ఆయన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు పైగా రాఫెల్ యుద్దవిమానాల వ్యవహారంలో అంబానీకి బారీగా లబ్ధి కలిగేవిధంగా అవినీతికి పాల్పడ్డారు. 

ఇక్కడ రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతోంది. సిఎం కెసిఆర్‌ కూడా బూటకపు వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను అమలుచేయకుండా కాలక్షేపం చేసేస్తున్నారు. రాష్ట్రంలో పేదప్రజల కోసం 22లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తామని అన్నారు. కానీ ఇంతవరకు 5లక్షల ఇళ్ళు కూడా కట్టించి ఇవ్వలేకపోయారు. ఇంటికో ఉద్యోగం అన్నారు కానీ నాలుగేళ్ళలో పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. తెలంగాణా ఏర్పడి టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకొంటున్నారు? ఈ నాలుగేళ్ళలో రాష్ట్రంలో 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. దానికి టిఆర్ఎస్‌ సర్కార్ బాధ్యత వహించదా? సిఎం కెసిఆర్‌ తాను ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోయారు కనీసం విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కూడా కేంద్రం నుంచి సాధించుకోలేకపోయారు. పైగా మోడీకి వంతపాడుతూ ఆయన నిర్ణయాలకు బేషరతుగా మద్దతు ఇస్తుంటారు. నోట్లరద్ధు, జిఎస్టిల విషయంలో కెసిఆర్ కేంద్రానికి ఎందుకు మద్దతు ఇచ్చారు? కారణం ఏమిటి? 

ఏపికి ప్రత్యేకహోదా ఇస్తామని విభజన సమయంలో మేము ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాము. ప్రత్యేకహోదా ఏపీ ప్రజల హక్కు. అలాగే తెలంగాణాకు రావలసినవి సాధించుకోవడం ఇక్కడి ప్రజల హక్కు,”  అని రాహుల్ గాంధీ అన్నారు.


Related Post