రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా శివానంద ప్రసాద్

August 13, 2018


img

తెలంగాణా రాష్ట్ర  అడ్వకేట్ జనరల్ గా బి.శివానంద ప్రసాద్ నియమితులయ్యారు. జనగావ్ జిల్లాకు చెందిన ఆయన 1987లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలకు ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందించారు. 

ఇంతకు ముందు తెలంగాణా రాష్ట్ర  అడ్వకేట్ జనరల్ గా సేవలు అందించిన ప్రకాష్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది మార్చిలో తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగానే ఉండిపోయింది. శివానంద్ నియామకానికి ముందు ప్రభుత్వం ఆయన రాజీనామా లేఖను ఆమోదించింది. 

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాల రద్ధు కేసులో ప్రకాష్ రెడ్డి సమర్ధంగా వాదించలేకపోయారని భావించిన ప్రభుత్వం ఆ కేసును సుప్రీం కోర్టు న్యాయవాది హారేష్ సాల్వేకు అప్పగించడంతో ప్రకాష్ రెడ్డి ఆగ్రహంతో వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల కేసు నేటికీ కొనసాగుతూనే ఉంది. దానికి ఇంకా అనేక చిక్కుముళ్ళు పడ్డాయి కూడా. ఈ ఒక్క కేసులోనే కాకుండా తెలంగాణా ప్రభుత్వం ఇంకా అనేకసార్లు హైకోర్టులో ఎదురుదెబ్బలు తింటోంది. కనుక అడ్వకేట్ జనరల్ పదవి అంటే కత్తిమీద సామువంటిదేనని చెప్పవచ్చు. కొత్తగా నియమితులైన తెలంగాణా రాష్ట్ర  అడ్వకేట్ జనరల్ బి.శివానంద ప్రసాద్ ఏవిధంగా నెగ్గుకు వస్తారో చూడాలి.



Related Post