స్టే ఇవ్వలేదు కదా.. కేసు కొనసాగుతుంది

August 10, 2018


img

హైకోర్టులో ఈరోజు తెలంగాణా ప్రభుత్వానికి మరోసారి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవలసివచ్చింది. అదీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ కుమార్‌ల కేసులోనే. 

వారిరువురి శాసనసభ్యత్వాలను పునరుద్దరించాలని హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయనందుకు కోర్టుధిక్కారం కేసు ఎదుర్కొంటోంది. దానిపై ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనానికి అప్పీలు చేసుకొంది. అయితే ముందు సింగిల్ జడ్జ్ వద్ద కొనసాగుతున్న కోర్టు ధిక్కారకేసును ఎదుర్కోవలసిందిగా హైకోర్టు ధర్మాసనం ఆదేశించడంతో ప్రభుత్వానికి అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. ధర్మాసనంలో చేసుకొన్నా అప్పీలుపై తదుపరి విచారణ ఆగస్ట్ 16కి వాయిదా పడింది.  

కనుక ప్రభుత్వ న్యాయవాది ఈరోజు హైకోర్టు సింగిల్ జడ్జ్ ముందు హాజరుకాక తప్పలేదు. ఈ కేసుపై హైకోర్టు ధర్మాసనంలో అప్పీలు చేసుకోన్నాము కనుక ఆగస్ట్ 16వరకు ఈ కోర్టు ధిక్కార కేసును వాయిదా వేయాలని న్యాయమూర్తిని అభ్యర్ధించగా, “ఈ విచారణపై హైకోర్టు ధర్మాసనం స్టే ఇవ్వలేదు కదా మరి వాయిదా వేయడం ఎందుకు?” అని న్యాయమూర్తి ఎదురు ప్రశ్నించారు. ఈ కేసులో రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శులు ఇద్దరికీ సోమవారం ఫాం-1 క్రింద నోటీసులు జారీ చేయబోతున్నట్లు న్యాయమూర్తి చెప్పారు. అనంతరం ఈ కోర్టుధిక్కారం కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వం రద్దు చేస్తే వారిరువురూ రాజకీయంగా నష్టపోవాలి. కానీ ఈ కేసులు, వాయిదాలు, కోర్టు నిర్ణయాల కారణంగా వారిరువురికి మంచి మీడియా కవరేజి ఉచితంగా లభిస్తుండగా, వారిపై చర్యలు తీసుకొన్న ప్రభుత్వం ఇప్పుడు కోర్టు ధిక్కారం కేసును ఎదుర్కోవలసి రావడం విచిత్రమే.


Related Post