రాహుల్ పర్యటనకు తెరాస అవరోధాలు?

August 10, 2018


img

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 13,14 తేదీలలో హైదరాబాద్‌లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా 14వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులతో సమావేశం కాబోతున్నారు. అయితే ఉస్మానియాలో అయన పర్యటనను అడ్డుకొనేందుకు తెరాస నేతలు బిసి, దళిత విద్యార్ధులను రెచ్చగొడుతున్నారని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

సిఎం కేసీఆర్‌కు దమ్ముంటే మంత్రులు కేటీఆర్‌, హరీష్ రావులను యూనివర్సిటీకి పంపించి రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. విద్యార్ధులను అడ్డుపెట్టుకొని నీచరాజకీయాలు చేయవద్దని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెరాస కార్యకర్తలతో రాహుల్ గాంధీ పర్యటనకు అవరోధాలు సృష్టించాలని చూస్తే సహించబోమని, ఎట్టిపరిస్థితులలో తమ అధినేత రాహుల్ గాంధీ ఉస్మానియా విద్యార్ధులతో సమావేశం అవుతారని రేవంత్ రెడ్డి అన్నారు. 

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఉస్మానియా విద్యార్ధులు మా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని యూనివర్సిటీకి ఆహ్వానించారు. కానీ యూనివర్సిటీ వైస్-ఛాన్సిలర్ ఇంతవరకు ఈ సమావేశంపై తన నిర్ణయం చెప్పలేదు. అలాగే హరిత ప్లాజాలో రాహుల్ గాంధీ బస చేయాలనుకొంటే, దానిపై కూడా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు,” అని అన్నారు. 

కారణాలు ఏవైనప్పటికీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులను తెరాస సర్కార్ దూరంగా ఉంచుతోంది. తెరాస మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎవరూ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి అక్కడి విద్యార్ధులతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కనుక విద్యార్ధులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉండటం సహజమే. వారితో మాట్లాడి వారిని కాంగ్రెస్ పార్టీవైపు తిప్పుకోవాలని రాహుల్ గాంధీ ప్రయత్నించడం కూడా సహజమే. ఒకవేళ రాహుల్ గాంధీ ఉస్మానియా విద్యార్ధులను మెప్పించగలిగితే, వారు తెరాసకు శాశ్వితంగా దూరం అవుతారు. కనుక రాహుల్ గాంధీ ఉస్మానియా పర్యటనను అడ్డుకోవాలని ప్రయత్నించే అవకాశాలున్నాయి. అదే కాంగ్రెస్‌ నేతలు చెపుతున్నారు. కాంగ్రెస్‌ నేతల ఈ ఆరోపణలపై తెరాస ఇంకా స్పందించవలసి ఉంది.


Related Post