సూర్యాపేట కలెక్టర్ ఆఫీసు నిర్మాణానికి లైన్ క్లియర్

August 10, 2018


img

సూర్యాపేట జిల్లాలో కుడకుడ గ్రామసమీపంలో సమీకృత కలెక్టర్ కార్యాలయ నిర్మాణానికి ఎదురవుతున్న అవరోధాలను హైకోర్టు తొలగించివేసింది. స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ భర్త భాగస్వామిగా ఉన్న సాయి డెవలపర్స్ కు ఆర్ధిక లబ్ది కలిగించేందుకే ఆ సంస్థకు చెందిన భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసి అక్కడ కలెక్టర్ కార్యాలయం నిర్మిస్తోందని ఆరోపిస్తూ చకిలం రాజేశ్వర్ రావు అనే కాంగ్రెస్‌ నేత హైకోర్టులో ఒక ప్రజాహిత పిటిషన్ (పిల్) వేశారు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం దానిపై గురువారం విచారణ జరిపి, ఇరు పక్షాల వాదోపవాదనలు విన్న తరువాత ఆ పిటిషనును తిరస్కరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పిటిషనరుకు మొట్టికాయలు కూడా వేసింది. 

“పిటిషనర్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తి అనే విషయం దాచిపెట్టడం ద్వారా అతను రాజకీయ కారణాలతోనే ఈ పిటిషన్ వేసినట్లు భావిస్తున్నాము. ఈ కేసులో కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇంప్లీడ్ కావాలనుకోవడం అదే సూచిస్తోంది. జిల్లాల పునర్విభజన జరుగక మునుపు సాయి డెవలపర్స్ సంస్థ అక్కడ స్థలం కొనుగోలు చేసింది. కనుక ఈ విషయంలో దానిని తప్పుపట్టలేము. అయితే ఆ సంస్థ భాగస్వామికి పలుకుబడి ఉన్నందున, ప్రభుత్వ నిర్ణయాల గురించి ముందుగానే సమాచారం లభించే అవకాశం ఉంది. కానీ అంతమాత్రన్న ఆ సంస్థను, ప్రభుత్వాన్ని తప్పు పట్టలేము. కలెక్టర్ కార్యాలయానికి 25 ఎకరాల భూమి అవసరమైతే, సాయి డెవలపర్స్ నుంచి ప్రభుత్వం కేవలం 8  ఎకరాలు మాత్రమే కొనుగోలు చేసింది. అది కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే జరిగింది. ఈ వ్యవహరంలో ప్రభుత్వానికి దురుదేశ్యం ఉన్నట్లు పిటిషనర్ నిరూపించలేకపోయారు. అయన రాజకీయ కారణాలతోనే ఈ పిటిషన్ వేసినట్లు భావిస్తున్నాము కనుక దీనిని తిరస్కరిస్తున్నాము,” అని ధర్మాసనం చెప్పింది. 

దీంతో కుడకుడ గ్రామం వద్ద సూర్యాపేట సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాల నిర్మాణానికి అన్ని అవరోధాలు తొలగిపోయినట్లే భావించవచ్చు.


Related Post