మద్దతు ఇవ్వండి..ప్రకంపనలు సృష్టించండి

July 20, 2018


img

మోడీ ప్రభుత్వంపై తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు లోక్ సభలో చర్చ అనంతరం ఓటింగ్ జరుగబోతున్నాయి. లోక్ సభ సభలో ఎన్డీయేకు పూర్తి మెజారిటీ ఉంది కనుక ఈ తీర్మానం వీగిపోతుందని అందరికీ ముందే తెలుసు. కానీ దీంతో ప్రతిపక్షాలన్నీ కలిసి కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయగలుగుతాయి కనుక అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని తెదేపా కోరుతోంది. 

శివసేన, అన్నాడిఎంకె పార్టీలు మోడీ సర్కార్ కు అనుకూలంగా ఓటు వేస్తామని ముందే స్పష్టం చేశాయి. కాంగ్రెస్, డిఎంకె, ఆమాద్మీ, వామపక్షాలు, ఇంకా మరికొన్ని పార్టీలు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించాయి. తెరాస ఈ చర్చలో పాల్గొని కేంద్రాన్ని ఎండగడతామని చెపుతోంది కానీ మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తానని చెప్పడంలేదు. 

ఫెడరల్ ఫ్రంట్ తో జాతీయరాజకీయాలలో ప్రకంపనలు పుట్టిస్తానని గొప్పలు చెప్పుకొంటున్న సిఎం కెసిఆర్ తమ పార్టీ ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించి ప్రకంపనలు పుట్టించాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి కెసిఆర్ కు నిన్న విజ్ఞప్తి చేశారు. విభజన హామీలపై లోక్ సభలో తెరాస సభ్యులు కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణా ప్రభుత్వానికి కేంద్రానికి సత్సంబంధాలున్నందున బహుశః తెరాస మోడీ సర్కార్ కు అనుకూలంగానే ఓటు వేయవచ్చు. ఈ విషయం నిన్ననే తెరాస ఎంపిలు చూచాయగా చెప్పారు. ప్రత్యేకహోదా తదితర హామీలు కొత్త అంశం కాదని గత నాలుగేళ్ళుగా నలుగుతున్నవేనని కనుక వాటి కోసం ఇప్పుడు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వలన ప్రయోజనమేమీ ఉండబోదని అన్నారు. దీనిని తెదేపా-భాజపాల మధ్య ఆధిపత్యపోరుగా భావిస్తున్నామని అన్నారు. కనుక అవిశ్వాస తీర్మానంపై తెరాస ఎంపిల వైఖరి ఏమిటో స్పష్టం అర్ధమవుతూనే ఉంది.


Related Post