మా అవిశ్వాసానికి మీ మద్దతు: బాబు

July 19, 2018


img

మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రేపు పార్లమెంటులో చర్చ జరుగబోతోంది. కనుక తమ తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఏపి సిఎం చంద్రబాబు నాయుడు అన్ని పార్టీల ఎంపిలకు ఈరోజు లేఖలు వ్రాశారు. వాటితోబాటు ఏపికి ఇచ్చిన విభజన హామీల జాబితా వాటిని అమలుచేయకుండా కేంద్రం ఏవిధంగా రాష్ట్రాన్ని వచించిందో తెలియజేస్తూ ఒక చిన్న పుస్తకాన్ని పంపించారు. ప్రత్యేకహోదాతో సహా మొత్తం 18 హామీలను కేంద్రప్రభుత్వం అమలుచేయలేదని తెదేపా సర్కార్ దానిలో ఆరోపించింది. ఏపిని మోసగించినందుకే మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టవలసి వచ్చిందని కనుక పార్టీలకు అతీతంగా ఎంపిలు అందరూ రేపు తమ తీర్మానానికి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఆ లేఖలో కోరారు. 

విశాఖలో రైల్వేజోన్, కడపలో ఉక్కు కర్మాగారం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వంటి కొన్ని హామీల అమలు విషయంలో కేంద్రం మాట తప్పినమాట నిజం. అయితే ప్రత్యేకహోదా, రాజధానికి నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటి విషయాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజీపడినందునే ఆ హామీల అమలు కాలేదని అందరికీ తెలుసు. 

‘ప్రత్యేకహోదా రాదని చంద్రబాబుకి మూడేళ్ళ క్రితమే తెలుసునని అందుకే దానికి బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే తీసుకొన్నారని’ తెదేపా ఎంపి జేసి దివాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు ఎప్పుడో చెప్పారు. ‘ప్రత్యేకహోదా కంటే ప్యాకేజీయే మంచిది’ అని చెప్పింది చంద్రబాబు నాయుడే. ప్యాకేజీ ఇచ్చినందుకు వెంకయ్యనాయుడుకి సన్మానం చేశారు కూడా. మరిప్పుడు ప్రత్యేకహోదా ఇవ్వలేదని కేంద్రాన్ని ఏవిధంగా నిందిస్తారు? 

రాజధానికి ఎంత ఇవ్వదలచుకొందో కేంద్రప్రభుత్వం రెండున్నరేళ్ళ క్రితమే స్పష్టంగా చెప్పింది. కానీ చంద్రబాబు అప్పుడేమీ అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు చెపుతున్నారు. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను అస్మదీయులకు కట్టబెట్టి అంచనాలు పెంచి అవినీతికి పాల్పడుతున్నారని, కేంద్రం ఇచ్చిన డబ్బుకు లెక్కలు చెప్పడం లేదని భాజపా నేత పురందేశ్వరి చాలాసార్లు బాబుపై ఆరోపణలు చేసింది. కానీ అయన పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్రాన్ని తప్పు పడుతున్నారు. కనుక హామీల అమలు వైఫల్యంలో కేంద్రానికి ఎంత తప్పో తెదేపాది కూడా అంతే తప్పని చెప్పకతప్పదు.

మరి తనలో ఇన్ని తప్పులు ఉంచుకొని చంద్రబాబు నాయుడు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టారు? అంటే హామీల అమలు విషయంలో అయన వైఫల్యం చెందారని జగన్ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మితే వచ్చే ఎన్నికలలో తెదేపాను ఓడిస్తారనే భయంతోనే భాజపాతో తెగతెంపులు చేసుకొని దీనికి సిద్దపడ్డారని చెప్పవచ్చు. ఆలుగేల్లు అంటకాగిన తరువాత తెదేపా, భాజపాలు రెండూ తమ వైఫల్యాలను ఎదుటపార్టీపై త్రోసి తప్పించుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలో ప్రవేశపెట్టిందే ఈ అవిశ్వాస తీర్మానం. కనుక పార్లమెంటు వేదికగా రేపు వాటి మద్య జరుగబోయే రాజకీయ పోరాటంలో ఏ పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తాయో చూడాలి. 


Related Post