తెరాసలో కూడా అదే లొల్లి

July 19, 2018


img

ఎన్నికలు దగ్గర పడుతున్నందున ప్రస్తుతం అన్ని పార్టీలలో నేతల మధ్య టికెట్లు, సీట్ల గొడవ మొదలైంది. దానికి అధికార తెరాస కూడా అతీతంకాదని నిరూపిస్తున్నట్లుగా ఉన్నాయి మహబూబాబాద్ తెరాస ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మాటలు. 

రెండు రోజుల క్రితం అయన మహబూబాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “తెరాస చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ. పార్టీలో అందరూ అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉండాలి. వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టంగా చెప్పారు. కానీ నియోజకవర్గంలో కొంతమంది నేతలు సోయి లేకుండా టికెట్ల కోసం పార్టీలో ముఠాలు కడుతున్నారు. టికెట్ల కోసం చిత్తకార్తి కుక్కలా తిరుగుతున్నారు. ఈ పద్ధతి మంచిది కాదని వారందరికీ సూచిస్తున్నాను,” అని అన్నారు. 

 వచ్చే ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన మాట వాస్తవం. కానీ అయన చివరిసారి చేయించిన సర్వేలో కనీసం 30 మంది ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తికరంగా లేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ 30 మంది ఎమ్మెల్యేలు ఎవరో తెరాసలో ఉన్నవారికి...ముఖ్యంగా టికెట్ ఆశిస్తున్న నేతలకు బాగా తెలిసే ఉంటుంది. కనుక వచ్చే ఎన్నికలలో వారి స్థానంలో తాము పోటీ చేయాలని ఆశపడటం కూడా సహజమే. బహుశః ఇదే కారణం చేత బానోత్ శంఖర్ నాయక్ స్థానానికి కూడా పార్టీలో పోటీ మొదలై ఉండవచ్చు. ఈ విషయం అయన కూడా గ్రహించినట్లే ఉన్నారు. మళ్ళీ మాటమార్చి వచ్చే ఎన్నికలలో మహబూబాబాద్ అసెంబ్లీ టికెట్ ఎవరికీ ఇచ్చినా వారి విజయానికి గట్టిగా కృషి చేస్తాను,” అని అన్నారు.


Related Post