డిఎస్ మాకు వెన్నుపోటు పొడిచారు: కవిత

July 18, 2018


img

తెరాస నిజామాబాద్ ఎంపి కవిత ఒక ప్రముఖ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ఆయనకు కాంగ్రెస్ పార్టీ కనీసం ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించినప్పుడు అయన చాలా బాధపడుతూ మాపార్టీలో చేరారు. ఆయనను మాపార్టీ కళ్ళకు అద్దుకొని తీసుకొని క్యాబినెట్ హోదా గల ప్రభుత్వ సలహాదారు పదవిని ఇచ్చింది. ఆ తరువాత రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించింది. కానీ అయన మా పార్టీని వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేశారు. అయన మా పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు. అయన వలన పార్టీకి చాలా నష్టం కలిగింది. కనుకనే జిల్లా నేతలందరం కలిసి ఆయన గురించి మా నాయకుడు సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్ళాము,” అని చెప్పారు. 

“అయితే ఇంతవరకు ఆయనపై సిఎం కెసిఆర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు కదా?కనుక మీ పిర్యాదు బుట్ట దాఖలు అయినట్లేనా?” అనే ప్రశ్నకు “అలాగని మేము భావించడం లేదు. రాష్ట్ర స్థాయిలో అనేక సమస్యలు ఉంటాయి. కనుక జిల్లా స్థాయికి చెందిన ఈ సమస్యపై నిర్ణయం తీసుకోవడంలో కొంచెం ఆలస్యం జరగడం సహజమే. కానీ మేమెవరం సంయమనం కోల్పోము. మా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకొంటే దానికి మేము కట్టుబడి ఉంటాము,” అని కవిత సమాధానం చెప్పారు. 


Related Post