నోయిడాలో ఘోరప్రమాదం

July 18, 2018


img

దేశరాజధాని డిల్లీకి సమీపంలో ఉన్న నోయిడా నగరంలో మంగళవారం రాత్రి ఘోరప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం హటాత్తుగా పక్కనే ఉన్న మరో నాలుగు అంతస్తుల భవనంపై పైకి ఒరిగి కూలిపోయింది. దాంతో రెండు భవనాలలో ఉన్నవారు శిధిలాల క్రింద చిక్కుకుపోయారు. నిర్మాణంలో ఉన్న భవనంలో 12 మంది కూలీలు ఉండగా, పక్కనే ఉన్న భవనంలో 18 కుటుంబాలు నివసిస్తున్నాయి. రాత్రిపూట ఈ ప్రమాదం జరగడంతో రెండు భవనాలలో ఉన్నవారందరూ శిధిలాల క్రింద చిక్కుకొన్నారు. 

ఈసంగతి తెలియగానే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ సహాయ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన బారీ యంత్రాలతో అక్కడకు చేరుకొని సహాయకార్యక్రమాలు మొదలుపెట్టారు. బారీ స్థాయిలో కనిపిస్తున్న ఆ రెండు భవనాల శిధిలాలను చూసినట్లయితే వాటి క్రింద చిక్కుకొన్నవారెవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని అర్ధమవుతోంది. కానీ సహాయ బృందాలు వాటి ప్రయత్నాలు అవి చేస్తున్నాయి. 

స్థానికుల చెప్పిన దాని ప్రకారం ఆ 6 అంతస్తుల భవనం సుమారు రెండేళ్ళ క్రితం నిర్మించబడింది. కానీ దానికి అనుమతులు లేకపోవడం వలన ఎవరూ దానిలో దిగలేదు. దిగి ఉంటే ఇంకా అనేకమంది ప్రాణాలు కోల్పోయి ఉండేవారు. ఒక భవన నిర్మాణంలో లోపాల కారణంగా పక్కనే ఉన్న భవనంపై కూలిపోవడం, దానిలో నివసిస్తున్నవారు మూల్యం చెల్లించవలసిరావడం చాలా విచారకరం. మంగళవారం రాత్రి నుంచి శిధిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ముగ్గురి శవాలను వెలికి తీయగలిగారు. 



Related Post