తెలుగు రాష్ట్రాలలో బారీగా యురేనియం నిక్షేపాలు

July 18, 2018


img

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ (ఏఎండి) సంస్థ తాజాగా జరిపిన ఒక సర్వేలో రెండు తెలుగు రాష్ట్రాలలో బారీగా యురేనియం నిక్షేపాలున్నట్లు కనుగొంది. ఏపిలో కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ళ గ్రామంలో తెలంగాణాలో వనపర్తి జిల్లాలోని మస్తిపురం, మహబూబ్ నగర్ జిల్లాలోని వీరబోయినపల్లి, డిండి, సింగారం, హాజీపూర్ పరిధిలో బారీగా యురేనియం నిక్షేపాలున్నట్లు కనుగొంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి సుమారు 29,000 టన్నుల యురేనియం (ట్రైయురేనియం ఓక్టాక్సైడ్) నిలువలున్నట్లు కనుగొంది. దీంతో భారత్ లో యురేనియం నిలువలు 2.73 లక్షల టన్నులకు చేరింది. 

ఇదివరకు జరిపిన సర్వేల ప్రకారం దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా యురేనియం నిక్షేపాలున్నట్లు తేలింది. ఒక్క ఏపిలోనే 1.22 లక్షల టన్నుల నిక్షేపాలున్నాయి. ఏపి తరువాత స్థానంలో నిలిచిన ఝార్ఖండ్ రాష్ట్రంలో 57,420 టన్నులు, మేఘాలయలో 19,538 టన్నులు, తెలంగాణాలో 15,731 టన్నుల యురేనియం నిక్షేపాలున్నాయి. ఇప్పుడు ఏఎండి తాజా సర్వేలో కనుగొన్న నిక్షేపాలు వాటికి అధనం. 

అయితే యురేనియం ఎంత విలువైనదో అంత ప్రాణాంతకమైనది కూడా. భూమిలో నుంచి దానిని వెలికితీస్తున్నప్పుడు, వెలికి తీసిన తరువాత కూడా యురేనియం ప్రభావంతో పరిసర ప్రాంతాలలో పర్యావరణం, ప్రజలు, ఇతర ప్రాణుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే విశాఖ ఏజన్సీ ఏరియాలో యురేనియం నిక్షేపాలు వెలికి తీయడానికి స్థానిక గిరిజనులు, పర్యావరణ సంస్థలు, వాటి ఉద్యమకారులు, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి భూమిలో నుంచి యురేనియం నిలువలను సురక్షితంగా బయటకు తీయగలిగితే అది గొప్ప ఆర్ధికవనరు అవుతుంది.


Related Post