నేతన్నలను ఆదుకోండి: కేటిఆర్

July 17, 2018


img

తెలంగాణాలో వ్యవసాయం తరువాత స్థానంలో చేనేత, మరమగ్గాల పరిశ్రమ నిలుస్తుంది. అయితే దశాబ్దాలుగా నిరాధారణకు గురవడం చేత అవి మట్టిలో మాణిక్యాలవలె మిగిలిపోయాయి. వాటినే నమ్ముకొని జీవిస్తున్న నేతన్నల జీవితాలు దుర్బరమైపోయాయి. కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తెరాస సర్కార్ చేపడుతున్న అనేక చర్యల వలన మళ్ళీ వారి జీవితాలలో వెలుగులు కనిపిస్తున్నాయి. అయితే నేటికీ వారికోసం చేయవలసింది ఇంకా చాలా ఉందనే సంగతి ఆ శాఖ మంత్రి కేటిఆర్ ఎన్నడూ మరిచిపోలేదు. అందుకే కేంద్రజౌళి శాఖా మంత్రి స్మృతీ ఇరానిని కలిసి రాష్ట్రంలో చేనేత, మరమగ్గాల ఆధునీకీకరణకు ఆర్ధికసహాయం అందించవలసిందిగా అభ్యర్ధించారు. చేనేత, మరమగ్గాల కార్మికుల కోసం తమ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, నేతపనివారికి ఆదాయం కల్పించేందుకు చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదలైన వాటి గురించి మంత్రి కేటిఆర్ స్మృతీ ఇరానీకి వివరించారు. అలాగే వెనుకబడిన జిల్లాలలో చేనేత, మరమగ్గాలను అభివృద్ధి చేయడానికి వీలుగా 10 క్లస్టర్లు మంజూరు చేయాలని అభ్యర్ధించారు. 

కేటిఆర్ అభ్యర్ధనకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించడమే కాక అప్పటికప్పుడు తన శాఖలో ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి తెలంగాణా ప్రభుత్వ అభ్యర్ధనలను పరిశీలించి వాటిపై వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రమంత్రి సానుకూల స్పందన చూసి మంత్రి కేటిఆర్ కూడా చాలా సంతోషించారు. ఈవిషయంలో ఆమె తప్పకుండా తెలంగాణా రాష్ట్రానికి సహాయపడుతుందని భావిస్తున్నానని కేటిఆర్ చెప్పారు.


Related Post