అవిశ్వాస తీర్మానానికి తెరాస మళ్ళీ అడ్డుపడుతుందా?

July 17, 2018


img

త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన తెదేపా అందుకు తెరాస ఎంపిల మద్దతు కూడా కోరింది. సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగితే తప్పకుండా దానిలో పాల్గొంటామని తెరాస ఎంపిలు హామీ ఇచ్చారు. అయితే ఈసారి సమావేశాలలో హైకోర్టు విభజన కోసం పట్టుపడుతూ సభలో ఆందోళనలు చేయాలని తెరాస నిర్ణయించింది. 

క్రిందటిసారి సమావేశాలలో ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్లపై సభలో చర్చ జరపాలని పట్టుపడుతూ తెరాస సభ్యులు సభలో ఆందోళన చేశారు. అదే సమయంలో ఇతరపార్టీల సభ్యులు కూడా ఆందోళనలు చేయడంతో ‘సభ ఆర్డర్’లో లేదనే వంకతో అవిశ్వాస తీర్మానాలపై సభలో చర్చ జరుపకుండా కేంద్రప్రభుత్వం తప్పించుకొంది. కేంద్రాన్ని కాపాడేందుకే తెరాస సభ్యులు సభలో ఆందోళన చేశారని కాంగ్రెస్, తెదేపా విమర్శలు గుప్పించడంతో తెరాస వెనక్కు తగ్గింది. కానీ మళ్ళీ ఇప్పుడు హైకోర్టు విభజన కోసం ఆందోళనలు చేయాలని నిర్ణయించడంతో తెరాసపై మళ్ళీ అవే ఆరోపణలు, విమర్శలు రాకతప్పవు. తెరాస అధిష్టానానికి ఈ సంగతి తెలియదనుకోలేము కానీ తెలిసి అందుకు సిద్దమవుతోంది అంటే మోడీ సర్కార్ కు అండగా నిలబడాలని భావిస్తున్నట్లే అనుకోకతప్పదు. 

నిజానికి రిజర్వేషన్ల అంశంపై తెరాసకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈసారి కూడా వాటి గురించి పార్లమెంటులో కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించాలి. కానీ ఇప్పుడు దానిని పక్కనపెట్టి హైకోర్టు అంశంపై ఆందోళన చేయడానికి సిద్దమవుతోంది. అయితే ఏపి సర్కార్ అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకు శరవేగంగా పనులు చేస్తోందని, ఈ ఏడాది సెప్టెంబర్ చివరిలోగా హైకోర్టు విభజన ప్రక్రియ మొదలవుతుందని, వచ్చే జనవరినాటికల్లా ఏపిలో హైకోర్టు పనిచేస్తుందని రాష్ట్ర న్యాయశాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వయంగా చెప్పారు. ఒకపక్క హైకోర్టు విభజనకు ఏర్పాట్లు జరుగుతుంటే, పార్లమెంటులో మళ్ళీ దానికోసం ఆందోళనలు చేయడం ఎందుకు? అనే సందేహం కలుగకమానదు. కనుక తెరాస ఆందోళనలు రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసమా లేక మోడీ సర్కార్ ను అవిశ్వాస తీర్మానాల బారి నుంచి కాపాడటం కోసమా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్లమెంటులో తెరాస వ్యూహం ఏమిటో సమావేశాలు మొదలవగానే ఎలాగూ తెలుస్తుంది.


Related Post