గొడవలు వద్దంటూనే...

July 16, 2018


img

కాంగ్రెస్ నేతలు తమలో తాము టికెట్లు, పదవుల కోసం కుమ్ములాడుకొంటే తెరాస లాభపడుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం భువనగిరిలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. రాష్ట్ర ఎఐసిసి కార్యదర్శి సలీం అహ్మద్, మల్లు రవి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు హాజరయ్యారు. ఆ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విభేదాలు పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా తెరాసను ఎదుర్కోవాలని అన్నారు. తెరాస గెలిస్తే కెసిఆర్ లేదా కేటిఆర్ లేదా హరీష్ రావులలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారని, కానీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కష్టపడి పనిచేస్తున్నవారు ఎవరైనా ముఖ్యమంత్రి కాగలరని అన్నారు. 

అంతవరకు బాగానే ఉంది కానీ ఆ తరువాత అన్నమాటే మొదట చెప్పినదానికి విరుద్దంగా ఉంది. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని, నల్గొండ జిల్లాకు చెందిన నాయకుడే తెలంగాణాకు ముఖ్యమంత్రి అవుతారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మనలో మనకి గొడవలు వద్దంటూనే, మా జిల్లాకు చెందిన నాయకుడే ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం ఇతర జిల్లాల కాంగ్రెస్ నేతలను కవ్వించడమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కనీసం ఒక అరడజనుమంది ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. అందరూ వేర్వేరు జిల్లాలకు చెందినవారే. ఎఐసిసి కార్యదర్శి సలీం అహ్మద్ సమక్షంలోనే రాజగోపాల్ రెడ్డి ఈ మాట అన్నారు. అప్పుడు ఆయనైనా వారించి ఉండాల్సింది. కానీ వారించలేదు కనుక ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న ఇతర జిల్లాల నేతలు కూడా ఈ అంశంపై గొంతువిప్పితే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయే.

కొసమెరుపు: ఇదే సమావేశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరులు బిగ్గరగా నినాదాలు చేస్తూ గొడవపడి ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకొన్నారు. వచ్చే ఎన్నికలలో తమ వర్గానికి చెందినవ్యక్తికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో సమావేశం రసాభాసయ్యింది. ఏఐసిసి కార్యదర్శి సమక్షంలోనే ఇదంతా జరిగింది.


Related Post