అంజన్నకు కోపమొచ్చింది

July 16, 2018


img

వచ్చే ఎన్నికలలో తాను సికింద్రాబాద్ నుంచి లోక్ సభకు పోటీ చేయాలనుకొంటున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ నేత అజారుద్దీన్ చేసిన ఆ చిన్న ప్రకటనతో ఊహించినట్లుగానే టి-కాంగ్రెస్ లో కలకలం మొదలైంది. అయన ప్రకటనపై నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, సికింద్రాబాద్ మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు గాంధీభవన్ లో జరిగిన నగర కాంగ్రెస్ కమిటీ సమావేశంలో అంజన్ యాదవ్ మాట్లాడుతూ “గతంలో నేను ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అజారుద్దీన్ ఏవిధంగా అనుకొంటున్నారు? ఆయనకు లోక్ సభకు పోటీ చేయాలని ముచ్చటగా ఉంటే హైదరాబాద్ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది. వచ్చే ఎన్నికలలో నేనే సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తాను. సికింద్రాబాద్ ను విడిచిపెట్టేది లేదు,” అని స్పష్టం చేశారు. 

భాజపా నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగంజనార్ధన్ రెడ్డికి నాగర్ కర్నూల్ నుంచి శాసనసభకు పోటీ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఖరారు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తెరాసలో చేరిపోయిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకరు ఆశిస్తున్న స్థానాన్ని పార్టీలో మరొకరికి కేటాయిస్తే ఏమవుతుందో తెలుసుకోవడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఒకవేళ అజారుద్దీన్ కు సికింద్రాబాద్ టికెట్ కేటాయిస్తే అప్పుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా తిరుగుబాటు చేయవచ్చు లేదా పార్టీ వీడవచ్చు కనుక టికెట్స్ కేటాయింపులు ఎప్పుడూ పెద్ద తలనొప్పి వ్యవహారమే. 


Related Post