మెట్రో కబుర్లు

June 23, 2018


img

హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులకు అనుబంధంగా అద్దెకు విద్యుత్ కార్లను నేటి నుంచి మియాపూర్ స్టేషన్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మొదటిదశలో 25 విద్యుత్ కార్లను ఏర్పాటు చేశారు. ఈ కార్లను డ్రైవర్ లేకుండా ప్రయాణికులు స్వయంగా నడుపుకోవచ్చు. వీటికి కిమీ దూరానికి రూ.8.50 లేదా గంటకు రూ.40 అద్దెగా నిర్ణయించారు. ఈ విద్యుత్ కార్లను అవసరమైన చోట చార్జింగ్ చేసుకునేందుకు వీలుగా నగరంలో గల అన్ని మెట్రో స్టేషన్లలో, కొత్తగా ఏర్పాటు చేస్తున్న 42 మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ లలో పబ్లిక్ చార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి ఛార్జింగ్ చేసినట్లయితే 100-150 కిమీ దూరం ప్రయాణించవచ్చు. 

ఈ అద్దె విద్యుత్ కార్లను వినియోగించదలచుకున్నవారు ముందుగా తమ స్మార్ట్ మొబైల్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా జెడ్.ఏ.పి. అనే మొబైల్ యాప్ ను దౌన్ లోడ్ చేసుకోవాలి. దానిలో మన వివరాలను నింపి, కొంత మొత్తం చెల్లించి సభ్యత్వం పొందవలసి ఉంటుంది. మొబైల్ యాప్ లోనే కార్ లాక్, అన్ లాక్ ఆప్షన్లు ఉంటాయి. వాటితో కారులోకి ప్రవేశించి మన గమ్యస్థానాలకు చేరుకొని కారును పార్క్ చేస్తే సరిపోతుంది. తరువాత కారు నిర్వాహకులే దానిని తీసుకువెళతారు. లేదా ఆ ప్రాంతంలో ఆ కారును అద్దెపై పొందగోరేవారు ఉపయోగించుకొంటారు. 

హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గించేందుకు విద్యుత్ నడిచే కార్లను ప్రవేశపెడుతున్నామని జూమ్‌ కార్‌ ఇండియా సీఈవో సురేందర్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే అన్ని మెట్రో స్టేషన్లకు వీటిని విస్తరిస్తామని చెప్పారు. విద్యుత్ కార్లకు గంటకు రూ.40 అద్దె అంటే చాలా తక్కువేనని చెప్పవచ్చు. కుటుంబ సమేతంగా వెళ్ళేవారికి ఇది నామమాత్రపు అద్దె అనే చెప్పవచ్చు.


Related Post