ఇల్లందులో రైతుబంధు చెక్కులు స్వాహా!

June 22, 2018


img

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలం చల్లసముద్రం గ్రామంలోని తెరాస, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొందరు స్థానిక నేతలు కలిసి 10 మంది రైతుల పేరిట నకిలీ పాసు పుస్తకాలను సృష్టించి రూ.1,53,600 స్వాహా చేసినట్లు తాజా సమాచారం. విశేషమేమిటంటే ఆ 10 మంది జాబితాలో కొందరు చనిపోయిన రైతుల పేర్లు కూడా ఉన్నాయి. చనిపోయిన రైతులలో ఒక్కొక్కరికీ కనీసం రూ.10-20,000 వరకు చెక్కులు లభించాయి. కొంతకాలం క్రితం చనిపోయిన బానోత్ తకిర్యా, భూక్యా మల్లు పేర్లతో నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి రైతుబంధుసొమ్మును స్వాహా చేసినట్లు సమాచారం.

ఈ విషయం మీడియాకు పొక్కడంతో సదరు నేతలిద్దరూ గ్రామంలోని దళిత రైతులతో రహస్యంగా సమావేశమయ్యి ఆ డబ్బును వారికి అప్పగించేస్తామని, విచారణ కోసం ఎవరు వచ్చినా నోరు మెదపవద్దని కోరినట్లు సమాచారం. మీడియాలో వచ్చిన వార్తలతో అప్రమత్తమైన తహసిల్దార్ వై శ్రీనివాసులు చల్లసముద్రం గ్రామానికి వెళ్లి భూరికార్డులు తనికీ చేసి 10 మంది రైతుల పేర్లతో సొమ్ము కాజేయబడటం నిజమేనని కనుగొన్నారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, తెరాసలకు చెందిన నేతలకు ఏ.ఈ.ఓ., వి.ఆర్.ఓ.,ఆర్.ఓ.లు సహకరించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. విచారణలో పూర్తయిన తరువాత నిందితులు అందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. 


Related Post