బదిలీలపై మళ్ళీ నిషేధం

June 19, 2018


img

తెలంగాణా ప్రభుత్వోద్యోగుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ నిషేధం విదించింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.కె.జోషి ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ బదిలీలపై నిషేధం జూన్ 16 నుంచి అమలులోకి వచ్చిందని, ఆరు నెలలపాటు ఈ నిషేధం అమలులో ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. కనుక ఇక నుంచి ప్రభుత్వం, ఆర్ధికశాఖ అనుమతి లేకుండా ఏ శాఖలోను ఉద్యోగులు, అధికారులను బదిలీ చేయరాదని ఉత్తర్వులలో పేర్కొన్నారు. అయితే ఉపాద్యాయుల బదిలీలపై ఇంకా నిషేధం విదించలేదు. ఆ ప్రక్రియ పూర్తయిన తరువాత వాటిపై కూడా నిషేధం విధిస్తుంది. 

ప్రభుత్వోద్యోగుల బదిలీలపై నిషేధం విధించినప్పటికీ కొన్ని ప్రత్యేక కేసులకు సడలింపు ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఆ వివరాలు: 

పదోన్నతులపై బదిలీ అయ్యేవారికి ఈ నిషేధం వర్తించదు. కానీ బదిలీ అయ్యే ప్రాంతంలో ఆ పదవి ఖాళీ ఉండాలి. ఆరు నెలలు అంతకంటే ఎక్కువ కాలం శలవులో వెళ్లినవారికి పోస్టింగ్ ఇవ్వవచ్చు. కానీ అక్కడ ఆ పోస్టు ముందే ఖాళీగా ఉన్నపుడే పోస్టింగ్ ఇవ్వవచ్చు. వివిధ శాఖలలో ఏ జిల్లాలోనైనా ఏ కారణం చేతైనా పోస్టులు రద్దు చేసినట్లయితే, ఆ పోస్టులో ఉన్న ఉద్యోగిని వేరే ప్రాంతానికి బదిలీ చేయవచ్చు. పరిపాలనా సౌలభ్యం కోసం బదిలీలు చేపట్టాలంటే తప్పనిసరిగా సంబంధిత మంత్రి, ప్రధాన కార్యదర్శి, ఆర్ధికశాఖ కార్యదర్శి అనుమతి పొందాలి. 


Related Post