భాజపా కూడా రధం ఎక్కుతోంది

June 19, 2018


img

తెలంగాణాలో అని పార్టీలకు ఎన్నికల వేడి ఎప్పుడో మొదలైంది. భాజపా కూడా ఎన్నికలకు సిద్దం అవుతోంది. ఆ ప్రయత్నంలో భాగంగా జూన్ 23 నుంచి ‘ప్రజాచైతన్య యాత్ర’ పేరిట రెండువారాలు బస్సు యాత్రకు బయలుదేరుతోంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, “పంచాయితీ ఎన్నికలతో రాష్ట్రంలో మా విజయపరంపర ప్రారంభమయ్యి సార్వత్రిక ఎన్నికలలో శాసనసభ, లోక్ సభ స్థానాలు గెలుచుకొనేవరకు అది కొనసాగుతుంది. మా ఈ లక్ష్యసాధన కోసం రాష్ట్రంలో 24,000 బూత్ కమిటీలు ఏర్పాటు చేశాము. అన్ని జిల్లాలలో మండల స్థాయిలో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నాము,” అని చెప్పారు. 

తెరాస పాలనపై విమర్శలు గుప్పిస్తూ, "దేశంలో సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్. అయన మాటలు కోటలు దాటిపోతాయి. కానీ చేతలు మాత్రం ప్రగతి భవన్ దాటవు. గత ఎన్నికలలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని కెసిఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ తన ఇంట్లో వాళ్ళకు మాత్రమే 5 ఉద్యోగాలు ఇచ్చారు. నాలుగేళ్ళు పూర్తయిపోయాయి. ఇంకా లక్షన్నర ఉద్యోగాలు ఎప్పుడిస్తారో? ఆయనే చెప్పాలి," అని లక్ష్మణ్ విమర్శించారు. 

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ కూడా దేశంలో కోటి ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ కనీసం లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వాటికి లక్ష్మణ్ తో సహా భాజపా నేతలు ఎవరూ సమాధానం చెప్పరు. అసలు ఆ ప్రస్తావన రాకుండా జాగ్రత్తపడుతుంటారు. జాతీయ స్థాయిలో లక్ష ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కానప్పుడు రాష్ట్ర స్థాయిలో లక్షన్నర ఉద్యోగాలు ఇవ్వడం కష్టమే కదా!


Related Post