డిల్లీలో దోస్తీ...గల్లీలో దుష్మనీ..!

June 19, 2018


img

మొన్న డిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యవసాయాభివృద్ధి తదితర అంశాలపై ప్రతిపాదనలకు సిఎం కెసిఆర్ మద్దతు పలికారు. కానీ కెసిఆర్ చేసిన విన్నపాలను ప్రధాని మోడీ పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే కాంగ్రెస్ నేతలు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “గిరిజనులకు, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించకపోతే భూకంపం సృష్టిస్తానని చెప్పిన కెసిఆర్, దానిపై కేంద్రం ఇంతవరకు స్పందించకపోయినా ఎందుకు స్పందించడం లేదు? వారికి రిజర్వేషన్లు కల్పించడానికి ప్రధాని మోడీ కూడా అనుకూలంగా ఉన్నారని సిఎం కెసిఆర్ స్వయంగా అసెంబ్లీలో చెప్పారు. మరి ఇంతవరకు తెలంగాణా ప్రభుత్వం పంపిన బిల్లుకు మోడీ సర్కార్ ఎందుకు ఆమోదించలేదు? విభజన చట్టంలో ఇచ్చిన హామీలు బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్సిటీ వగైరాల గురించి సిఎం కెసిఆర్ ప్రధాని మోడీని గట్టిగా ఎందుకు అడగలేకపోతున్నారు...అంటే మోడీతో రహస్య అవగాహన ఉన్నందునే అని అనుమానించవలసి వస్తోంది,” అని విమర్శించారు. 

టి-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క కూడా ఇంచుమించు అవే ప్రశ్నలు వేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్ర సమస్యల గురించి కేంద్రాన్ని కేసిఆర్ గట్టిగా నిలదీయలేకపోయారు. వారిద్దరి మద్య రహస్య అవగాహన ఉన్నందునే కెసిఆర్ మెతక వైఖరి అవలంభిస్తున్నారు. కెసిఆర్ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు,” అని విమర్శించారు.


Related Post