వ్యవసాయానికి తెలంగాణా మోడల్ బెస్ట్: కెసిఆర్

June 18, 2018


img

ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఆదివారం డిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైనవారిని ఉద్దేశ్యించి ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వవలసిందిగా కోరారు. దానిపై వివిధరాష్ట్రాల ముఖ్యమంత్రులు రకరకాల సలహాలు ఇచ్చారు. తమ తమ రాష్ట్రాలలో అమలుచేస్తున్న విధానాల గురించి వివరించారు. అయితే వారిలో సిఎం కెసిఆర్ తెలంగాణాలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి తన ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులు, చర్యలు, సంక్షేమ పధకాల గురించి వివరించినప్పుడు ప్రధాని నరేంద్రమోడీతో సహా అందరూ ముగ్ధులైయ్యారు. 

తమ ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, గోదాములు, వ్యవసాయ మార్కెట్ యార్డుల నిర్మాణం, పంటరుణాల మాఫీ, మిషన్ కాకతీయ పధకం క్రింద చెరువుల పునరుద్దరణ, వాటిలో చేప పిల్లల పెంపకం ద్వారా మత్స్యకారులకు ఉపాధి అవకాశం కల్పించడం, మిషన్ భగీరథ ద్వారా గ్రామాలలో ఇంటింటికీ శుద్దమైన త్రాగునీళ్ళు అందించడం, రాష్ట్రంలో సమగ్ర భూసర్వే, భూరికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పధకం క్రింద రైతులకు ఎకరాకు రూ.4,000 పంటపెట్టుబడి ఆర్ధికసహాయం, పాసుపుస్తకాల పంపిణీ, ఆగస్ట్ 15వ తేదీ నుంచి రాష్ట్రంలో రైతులందరికీ ఎల్.ఐ.సి.ద్వారా రూ.5 లక్షలు జీవితభీమా కల్పించడం మొదలైనవాటి గురించి సిఎం కెసిఆర్ వివరిస్తుంటే సమావేశంలో పాల్గొన్నవారందరూ చప్పట్లతో కెసిఆర్ కు అభినందనలు తెలియజేశారు. 

సిఎం కెసిఆర్ తన ప్రసంగం ముగిస్తూ తెలంగాణాలో తమ ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ పధకాలను, అభివృద్ధి కార్యక్రమాలను దేశమంతటా అమలుచేయగలిగితే, దేశంలో వ్యవసాయ రంగం తప్పకుండా బలోపేతం అవుతుందని ముక్తాయించారు. వ్యవసాయరంగం అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టినా తన ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని సభాముఖంగా హామీ ఇచ్చారు.


Related Post