ఆమ్రాపాలా...మజాకా?

June 13, 2018


img

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి విలక్షణ పనితీరు గురించి అందరికీ తెలిసిందే. ఆమె హటాత్తుగా ఎల్కతుర్తి మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో భూరికార్డులను తనికీ చేశారు. జీల్గుల, జగన్నాథ్ పూర్, కోతులనడుమ, తిమ్మాపూర్, బావుపేట గ్రామాలకు సంబంధించిన భూరికార్డులలో అనేక తప్పులు కనబడటంతో ఆమె సంబంధిత వి.ఆర్.ఓలు చంద్రమౌళి, తిరుపతి, రెవెన్యూ ఇనస్పెక్టర్ శ్రీధర్ లను సంజాయిషీ కోరగా వారు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పలేకపోయారు. వారికి కనీసం భూరికార్డులని ఏవిధంగా నిర్వహించాలనే దానిపై అవగాహన లేకపోవడం చూసి ఆమె మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళనను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటే, క్షేత్రస్థాయిలో అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారి వలన ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తోందని ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారు ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇదే కారణం చేత బుధవారం కన్నూర్ వి.ఆర్.ఓ. పి మల్లయను, భీంపెల్లి వి.ఆర్.ఓ. ఎస్. ప్రసాద్ ను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నట్లు సమాచారం. సరిగ్గా రెండు నెలల క్రితమే ఈ భూప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ ఉద్యోగులపై సిఎం కెసిఆర్ ప్రశంసలు కురిపించి, కేవలం 3 నెలలోగా ఈ సంక్లిష్టమైన పనిని పూర్తి చేసినందుకు వారికి బోనస్ గా ఒక నెల జీతం కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు వారిపై సస్పెన్షన్ వేటుపడుతుండటం విశేషం.   



Related Post