ప్రధాని మోడీని కలవనున్న సిఎం కెసిఆర్

June 13, 2018


img

జూన్ 17న డిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరుగబోతోంది. ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కెసిఆర్ ఇద్దరూ ఆ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ ప్రధాని నరేంద్రమోడీని విడివిడిగా కలువబోతున్నారు. 

సిఎం కెసిఆర్ కు ప్రధాని మోడీ శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారని తాజా సమాచారం కనుక అయన రేపు సాయంత్రమే డిల్లీ బయలుదేరనున్నారు. 

సిఎం కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనతో కర్ణాటకలో జెడిఎస్ కు మద్దతు ప్రకటించి, కర్ణాటక ఎన్నికలలో భాజపాను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా వచ్చేఎన్నికలలోగా దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని సిఎం కెసిఆర్ చెపుతున్నారు. ఈ నేపధ్యంలో జరుగబోతున్న మోడీ-కెసిఆర్ సమావేశం చాలా ఆసక్తికరంగా ఉంది.  

ఇక ఎపిలో తెదేపా భాజపాతో తెగతెంపులు చేసుకొని, ఆ తరువాత ఎన్డీయేలో నుంచి కూడా బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా మంత్రులు, నేతలు అందరూ నేరుగా ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ కారణంగా ప్రస్తుతం ఏపిలో తెదేపా-భాజపాల మద్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపద్యంలో అయన ప్రధానిమోడీతో సమావేశం కాబోతుండటం చాలా ఆసక్తికరంగా ఉంది. 

ఇక ఇద్దరు ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తే కేంద్రప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.


Related Post