బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రం మెలిక

June 13, 2018


img

కడప, బయ్యారం స్టీల్ ప్లాంట్ల ఏర్పాటు సాధ్యంకాదని కేంద్రప్రభుత్వం ఒక అఫిడవిట్ ద్వారా ఈరోజు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు గురించి కేంద్రం వైఖరి తెలపాలంటూ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వేసిన పిటిషన్ కు సమాధానంగా కేంద్రం ఎఫిడవిట్ ద్వారా సమాధానం చెప్పింది. 

విభజన చట్టంలో కడప, బయ్యారంలో స్టీల్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించమని మాత్రమే ఉందని, కనుక వాటి కోసం మెకాన్ అనే సంస్థతో అధ్యయనం చేయిస్తున్నామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వాస్తవానికి సాంకేతిక కారణాలచేత ఆ రెండు చోట్ల స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం సాధ్యంకాదని తాము మొదటే చెప్పామని కానీ రెండు ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు మెకాన్ సంస్థ చేత అధ్యయనం చేయిస్తున్నామని కేంద్రం తెలిపింది. 

అయితే మెకాన్ సంస్థ తుదినివేదిక అందిన తరువాత స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై తుది నిర్ణయం తెలియజేయగలమని కేంద్రం తెలిపింది. పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను రద్దు చేయవలసిందిగా కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. 

కడప, బయారంలో స్టీల్ ప్లాంట్స్ ఏర్పాటుపై కేంద్రప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకతతోనే ఉంది. కానీ రాజకీయ అవసరాలు, కారణాల చేత ఆ ప్రతిపాదనను పరిశీలనలో ఉందని చెపుతూ నాలుగేళ్ళు కాలక్షేపం చేసింది. అయితే వాస్తవానికి బయ్యారంలో లభించే ముడి ఇనుము 55 శాతం కంటే తక్కువ నాణ్యత కలిగి ఉన్నకారణంగా అక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు లాభదాయకం కాదని నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. ఇక కడపలో ప్లాంట్ ఏర్పాటుకు అటువంటి సాంకేతిక కారణాలనే చూపుతున్నప్పటికీ భాజపా-తెదేపాల సంబంధాలు చెడినందున అనేక హామీలలాగే ఈ ప్రతిపాదన అటకెక్కిపోయి ఉండవచ్చు. కారణాలు ఏవైనప్పటికీ కడప, బయ్యారంలో మోడీ సర్కార్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోదనేది స్పష్టం అయ్యింది కనుక ఇప్పుడు ఏపి, తెలంగాణా ప్రభుత్వాలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి.   Related Post