పంచాయితీ తప్పుకు భలే పరిహారం

June 13, 2018


img

కుమ్రుం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో చింతలమానేపల్లి మండలంలో కర్జెల్లి గ్రామంలో గల ఎస్టీ కాలనీలో ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటున్న వృద్ధదంపతులకు ఊహించని కష్టం, అంతలోనే ఊహించని గొప్ప బహుమతి లభించడం విశేషం. 

స్థానిక పంచాయితీ కార్యదర్శి పొరపాటున వారి గుడిసెకు రూ.500 పన్ను చెల్లించాలని నోటీస్ పంపాడు. ఈ విషయం ఆనోటా ఈనాట పాకి చివరకి టిపిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెవిలో పడింది. అయన ఆ వివరాలను రాష్ట్ర మున్సిపల్ శాఖమంత్రి కేటిఆర్ కు పంపించి వారి సమస్య పరిష్కరించి ఆ వృద్ధ దంపతులకు ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయవలసిందిగా ట్విట్టర్ ద్వారా కోరారు. 

దానిపై మంత్రి కేటిఆర్ తక్షణం స్పందిస్తూ, ఆ తప్పును వెంటనే సరిదిద్ది ఆ వృద్ధ దంపతులకు ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, దానితో పాటు ఆసరా పెన్షన్ కూడా మంజూరు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. 

పంచాయితీ కార్యదర్శి చేసిన పొరపాటుకు ఆ వృద్ధ దంపతులు మొదట చాలా బాధపడినప్పటికీ, ఆ చిన్న తప్పు కారణంగానే వారికి ఇప్పుడు ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దానితో పాటు జీవితాంతం నెలకు రూ.1000 చొప్పున ఆసరా పెన్షన్ కూడా లభించబోతోంది. ఆ వృద్ధ దంపతుల సమస్యను తన దృష్టికి తీసుకువచ్చినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు.Related Post