సింగరేణిలో సిఎం కెసిఆర్ ఆదేశాలు బేఖాతరు?

June 12, 2018


img

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు హైకోర్టు అనుమతి నిరాకరించినందున వాటి స్థానంలో ‘కారుణ్య నియామకాలు’ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు సింగరేణి సంస్థ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అనారోగ్య కారణాలతో పదవీ విరమణ చేయాలనుకునే కార్మికులకు ఇది పెద్ద ఉపశమనమే. అయితే సింగరేణి మెడికల్ బోర్డులో తిష్టవేసిన కొందరు కార్మికులను ముప్పతిప్పలు పెడుతున్నారు. 

సింగరేణి భూగర్భగనులలో చిరకాలం పనిచేసి తీవ్ర అనారోగ్యానికి గురైన 83 మంది కార్మికులు తమకు పదవీ విరమణ కల్పించి, కారుణ్య నియామకాల విధానం ద్వారా తమ కుటుంబ సభ్యులకు తమ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు. గత ఏడాదిగా వారందరూ మెడికల్ బోర్డు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. వారు అనారోగ్యంతో ఉన్నారనే కారణంతోనే మెడికల్ బోర్డు వారిని విధులు నిర్వహించడానికి అనుమతించలేదు. ఆ కారణంగా సింగరేణి వారికి వేతనాలు కూడా చెల్లించలేదని సమాచారం. కనుక వారందరూ కారుణ్య నియామకాలకు అన్నివిధాల అర్హులని స్పష్టం అవుతోంది. 

సింగరేణి సంస్థ కారుణ్య నియామకాల ప్రక్రియ చేపట్టింది కనుక నేడోరేపో తమపేర్లు ఆ జాబితాలో చేర్చుతారని వారందరూ ఓపికగా ఎదురుచూశారు. కానీ వారందరూ ఉపరితలంలో విధులు నిర్వహించడానికి ‘యోగ్యంగా’ ఉన్నారంటూ మెడికల్ బోర్డు తేల్చి చెప్పింది. ఆ మేరకు వారికి మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికేట్లు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది.  దాని సిఫార్సు మేరకు జి.ఎం. పర్సనల్ పేరిట ఏప్రిల్ 7- మే 3మద్య వరుసగా జారీ చేసిన సర్క్యులర్లలో వారందరినీ జనరల్ మజ్దూర్, బదిలీ వర్కర్లుగా నియమిస్తున్నట్లు పేర్కొంది. 

సింగరేణిలో వైద్యవిభాగంలో కొందరు అవినీతిపరులు తిష్టవేసిన సంగతి తనకు తెలుసునని, ఇకనైనా వారు తమ తీరు మార్చుకోవాలని లేకుంటే వారిపై కటినచర్యలు తీసుకుంటానని సిఎం కెసిఆర్ స్వయంగా హెచ్చరించారు. అలాగే వైద్యవిభాగంలో ఎవరైనా అధికారులు లంచాలు అడిగితే వారిని ముందు చెప్పుతో కొట్టి ఆ తరువాత పై అధికారులకు పిర్యాదు చేయాలని సిఎం కెసిఆర్ స్వయంగా సూచించారు. అయితే సిఎం కెసిఆర్ హెచ్చరికలను సింగరేణి వైద్యవిభాగం చెవికి ఎక్కినట్లు లేవు. అందుకే 84 మంది సింగరేణి కార్మికులపట్ల ఇంత అమానుషంగా వ్యవహరించింది. 

తక్షణమే విధులలో చేరాలంటూ జిఎం పర్శనల్ కార్యాలయం నుంచి వచ్చిన నోటీసులను చూసి ఆ 83 మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ ఆరోగ్యం బాగోలేనందునే ఇంతకాలం మెడికల్ బోర్డు చుట్టూ తిరిగామని ఇప్పుడు ఈ పరిస్థితులలో మళ్ళీ విధులలో చేరి పనిచేయమంటే ఎలాగ? అని వారు వాపోతున్నారు. అనారోగ్యంతో ఉన్న కార్మికులకు కాక మరి కారుణ్య నియామకాలు ఎవరికి వర్తిస్తాయి? అని వారు ప్రశ్నిస్తున్నారు. స్వయంగా సిఎం కెసిఆర్ హెచ్చరించినా సింగరేణిలో పరిస్థితులు మారకపోవడం విస్మయం కలిగిస్తుంది. మారాలంటే మరి ఏమి చేయాలో?


Related Post