బాలికల కోసం మరో సంక్షేమ పధకం

May 26, 2018


img

తెలంగాణా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతున్న వినూత్నమైన సంక్షేమ పధకాలు యావత్ దేశానికే స్ఫూర్తి కలిగించేవిగా నిలుస్తున్నాయి. తాజాగా హైస్కూలు విద్యార్ధినుల కొరకు హెల్త్ అండ్ హైజెనిక్ కిట్స్ అందజేయబోతున్నట్లు విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. శుక్రవారం డీఈఓలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలలో చదువుకొంటున్న సుమారు 8 లక్షల మంది విద్యార్ధినులకు హెల్త్ అండ్ హైజెనిక్ కిట్స్ అందజేయబోతున్నట్లు ప్రకటించారు. 

ఒక్కోటి రూ.400 విలువచేసే ఈ కిట్ లో బాలికలకు అవసరమైన 16 వస్తువులు ఉంటాయి. వాటిలో నాలుగు స్టే-ఫ్రీ న్యాప్ కిన్స్, రెండు టూత్ పేస్ట్ ట్యూబులు, ఒక టూత్ బ్రష్, టంగ్ క్లీనర్, కొబ్బరి నూనె, పౌడర్, అద్దం, దువ్వెన, జడ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, షాంపు, బొట్టు స్టిక్కర్ల ప్యాకెట్లు, మూడు స్నానపు సబ్బులు, రెండు బట్టల సబ్బులు ఉంటాయని మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. 

ప్రతీ 3 నెలలకు ఒకసారి చొప్పున ఏడాదికి నాలుగుసార్లు చొప్పున విద్యార్ధినులు అందరికీ ఈ కిట్స్ అందజేస్తుంటామని మంత్రి చెప్పారు. వేసవి శలవులలో పాఠశాలలు మూసివేసే ముందు కూడా అందరికీ ఈ కిట్స్ అందజేస్తామని చెప్పారు. విద్యార్ధినులు ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్న సిఎం కెసిఆర్ మరో ఆలోచన లేకుండా వెంటనే ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపారని చెప్పారు. ప్రభుత్వం ఏటా వీటి కోసం రూ.85 కేటాయిస్తుందని చెప్పారు. వచ్చే నెల పాఠశాలలు మళ్ళీ తెరవగానే విద్యార్ధినులు అందరికీ ఈ కిట్స్ అందించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవీలలో చదువుకొంటున్న విద్యార్ధినులు అందరికీ ఈ హెల్త్ అండ్ హైజినిక్ కిట్స్ అందిస్తామని చెప్పారు.

బాలికలలో రక్తహీనత బాగా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని, వారికి ఇక నుంచి పౌష్టికాహారం అందించబోతున్నట్లు చెప్పారు. మధ్యాహ్న భోజనంలో నెలకు నాలుగుసార్లు చికెన్, రెండుసార్లు మతాన్, వారానికి ఐదుసార్లు గుడ్లు, ప్రతీరోజు 50 గ్రాముల నెయ్యి అందించేవిధంగా కొత్త మెనూ రూపొందించామని మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. 

అలాగే ఇక నుంచి 9,10 వ తరగతి చదువుకుంటున్న విద్యార్ధులకు కూడా స్కూలు యూనిఫారం అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. యూనిఫారాల కోసం వేరేగా రూ.30 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. కేంద్రంతో మాట్లాడి కస్తూర్భా విద్యాలయాలలో 8 నుంచి 12వ తరగతి వరకు పొడిగించామని మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. 

వర్షాకాలం మొదలవగానే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం ప్రారంభించడానికి అందరూ సిద్దంగా ఉండాలని అన్నారు. ఇకపై ఉపాద్యాయుల చేత డీఈఓ, ఎంఈఓ కార్యాలయాలలో పనిచేయించకూడదని, ఒకవేళ ఎవరైనా పనిచేస్తున్నట్లయితే వారిని తక్షణమే వారివారి పాఠశాలలకు పంపించివేయాలని మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు.   

ఈ సమావేశంలో విద్యాశాఖకు చెందిన అధికారులు సుధాకర్‌ శర్మ, శ్రీహరి, రమణ కుమార్‌, విజయ్‌ కుమార్‌, సత్యనారాయణ రెడ్డి మరియు డీఈవోలు పాల్గొన్నారు.


Related Post