జీవన్ రెడ్డికీ తప్పలేదు

May 26, 2018


img

రైతులకు అందజేసిన పాసు పుస్తకాలలో చాలా తప్పులు దొర్లినట్లు సిఎం కెసిఆర్ దృష్టికి కూడా వచ్చింది. వాటిని సవరించేందుకు ఒక్కో జిల్లాకు ఒకరు చొప్పున 30 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. జూన్ 25లోగా పాసు పుస్తకాలలో తప్పులు సవరించి రైతులకు అందించాలని సిఎం కెసిఆర్ ఆదేశించడంతో రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగులు అందరూ మళ్ళీ క్షేత్రస్థాయిలో పని మొదలుపెట్టారు.

ఆ బాధితులలో తాను కూడా ఒకడినని కాంగ్రెస్ సిఎల్పి ఉపనేత జీవన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ లో అయన మీడియాతో మాట్లాడుతూ, “నేను డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన భూమి, నాకు అనువంశికంగా వచ్చినట్లు పాసు పుస్తకాలలో నమోదు చేశారు. హడావుడిగా ఇచ్చిన పాసు పుస్తకాలలో అన్నీ తప్పులుతడకలే ఉన్నాయి. ఇక రైతుబంధు చెక్కులు నిజంగా అవసరమున్న పేద రైతులకు ఇవ్వకుండా భూస్వాములకు, రాజకీయ నాయకులకు ఇవ్వడం చూస్తే, వారికోసమే సిఎం కెసిఆర్ ఈ పధకం అమలుచేస్తున్నారేమోననే అనుమానం కలుగుతోంది. ఎకరం, అరెకరం సాగుచేసే కౌలు రైతులకు పైసా ఇవ్వకుండా భూస్వాములకు అడగకుండానే లక్షల రూపాయలు ఉదారంగా పంచిపెడుతున్నారు. అసలు ఈ రైతుబంధు పధకమే లోపభూయిష్టంగా ఉంది. దీనిపై సిఎం కెసిఆర్ పునరాలోచన చేస్తే బాగుంటుంది. ఇంతకంటే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే వారికి చాలా మేలుచేసినవారవుతారు,” అని అన్నారు.


Related Post