మళ్ళీ చెపుతున్నా కెసిఆర్ మన మిత్రుడే: మోత్కుపల్లి

May 26, 2018


img

టిటిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు పార్టీతో శాస్త్రబద్ధంగా తెగతెంపులు చేసుకునే ప్రయత్నంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై నేరుగా తీవ్ర విమర్శలు చేశారు.

అయన శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “పార్టీలో అందరి కంటే సీనియర్ నైన నన్ను మహానాడుకు పిలవకుండా చంద్రబాబు అవమానించారు. ఇదేనా నాకు ఇచ్చే గౌరవం? ఇది నాకు జరిగిన అవమానం కాదు...నా మాదిగజాతికి చేసిన అవమానంగా భావిస్తాను. నేనే పెద్ద మాదిగనని చెప్పుకునే బాబుకు దళితులపై ఎటువంటి ప్రేమ, గౌరవం లేవు. అందుకే అయన ఏవిధంగా వ్యవహరిస్తున్నారు.  ఏపిలో అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అవుతున్నా ఇంతవరకు శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టలేదు? అదే.. తెలంగాణా సిఎం కెసిఆర్ ఆపని ఎప్పుడో చేసి చూపించారు.

తెదేపా ఇప్పుడు జనాధారణ ఉన్న నేతలు, కార్యకర్తల బలంతో నడవడం లేదు. కులం, డబ్బుతోనే నడుస్తోంది. నీతిలేని నాయకులను చంద్రబాబు నాయుడే స్వయంగా ప్రోత్సహిస్తున్నారు. అందుకు రేవంత్ రెడ్డి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కునందునే నువ్వు రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఆడి తెలంగాణాలో తెదేపాను సర్వనాశనం చేసినమాట నిజం కాదా? ఒకవేళ రేవంత్ రెడ్డి మాట విని కెసిఆర్ ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు కుట్ర చేసి ఉండి ఉంటే, అప్పుడే తెలంగాణా ప్రజలు తెదేపాను చెప్పుతో కొట్టేవారు. కానీ ఆ పొరపాటు చేయకపోవడం వలననే నేటికీ తెలంగాణాలో తెదేపా కనిపిస్తోంది. 

పార్టీ కోసం పరితపించే నావంటి నిబద్దత కలిగిన నాయకుడిని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి వంటి మూర్ఖులను ప్రోత్సహించడం వలననే రాష్ట్రంలో తెదేపా ఒక శ్మశానంలా మారిపోయింది. ఈ పరిస్థితి చూసే నేను తెదేపాను తెరాసలో విలీనం చేయాలని సూచించాను. ఇప్పటికే అదే మాట చెపుతున్నాను. మనకు కెసిఆర్ శత్రువు కాదు...మిత్రుడే. ఆయనతో సహా ఆ పార్టీలో చాలామంది నేతలు గతంలో మనతో కలిసి పనిచేసినవారే. కనుక మనం తెరాసతో కలిసి నడవడమే మంచిదని మళ్ళీ చెపుతున్నాను.        

రేవంత్ రెడ్డి బిడ్డ నిశ్చితార్దానికి, పెళ్ళికి నీ మంత్రులందరినీ వెంటబెట్టుకొని వెళ్లావు. కానీ నా బిడ్డ పెళ్ళికి పదేపదే ఫోన్లు చేస్తే ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోయావు. మన పార్టీతో సంబంధం లేకపోయినా సిఎం కెసిఆర్ ను ఆహ్వానించగానే అయన వెంటనే అంగీకరించడమే కాకుండా పెళ్ళికి వచ్చి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళారు. ఇదే మీకు ఆయనకు ఉన్న పెద్ద తేడా. 

ఇప్పటికైనా మించిపోయింది లేదు. చంద్రబాబు నాయుడు ఆత్మవిమర్శ చేసుకొని నావంటి నిబద్దత కలిగిన నాయకులకు పార్టీలో ప్రాధాన్యం కల్పించినట్లయితే పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. లేకుంటే ఏపిలో కూడా తెదేపా పతనం తప్పదు,” అని మోత్కుపల్లి అన్నారు. 

పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని ఇన్ని మాటలు అనేశారు కనుక మోత్కుపల్లి కోరుకొంటున్నట్లు ఆయనపై తెదేపా బహిష్కరణ వేటు వేయకమానదు. వేస్తే ఆయనకు లైన్ క్లియర్ అవుతుంది కనుక తెరాసలో చేరడానికి గట్టిగా ప్రయత్నించుకోవచ్చు.  


Related Post