ఇందుకేనా ఇన్సెంటివ్స్ ఇచ్చింది? కెసిఆర్

May 24, 2018


img

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొట్టమొదటిసారిగా తెలంగాణా రాష్ట్రంలో సమూలంగా భూసర్వే జరిపించి, దాని ప్రకారం భూరికార్డుల ప్రక్షాళన చేసింది తెలంగాణా ప్రభుత్వం. దీనికోసం రెవెన్యూ, వ్యవసాయశాఖ ఉద్యోగులు మూడు నెలలపాటు క్షేత్రస్థాయిలో పనిచేశారు. ఆ కార్యక్రమం విజయవంతం అవడంతో రాష్ట్ర ప్రభుత్వం మే 10వ తేదీ నుంచి రైతులకు కొత్త పాసుపుస్తకాలు, రైతుబందు చెక్కులు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టింది. కానీ అప్పుడే అసలు సమస్య బయటపడింది. రైతులకు అందించిన పాసుపుస్తకాలలో అనేక తప్పులుండటంతో రైతులు లబోదిబోమని మొత్తుకొంటూ తహసిల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది పేర్లు, ఫోటోలు మారిపోయాయి. మరికొంతమందివి భూవివరాలలో తప్పులు దొర్లాయి. కొంతమందికి కులం, మతం, ప్రాంతం వంటి వివరాలలో తప్పులు దొర్లాయి. ఈవిధంగా వందో వెయ్యో కాదు లక్షలలో తప్పులున్నట్లు అధికారులు గుర్తించారు.

దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణా ప్రభుత్వం మాత్రమే కేవలం మూడు నెలలో సమగ్ర భూప్రక్షాళణ జరిపి, రాష్ట్రంలో రైతులందరికీ కొత్త పాసుపుస్తకాలు అందించగలిగిందని ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, తెరాస నేతలు గొప్పగా చెప్పుకున్నారు. కానీ వేల సంఖ్యలో తప్పులు దొర్లినట్లు తెలుసుకొని సిఎం కెసిఆర్ అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నిన్న ప్రగతిభవన్ లో జిల్లా కలెక్టర్లతో సిఎం కెసిఆర్ జరిపిన సమీక్షా సమావేశం నిర్వహించారు. మూడు నెలలు గడువు ఇచ్చినా భూరికార్డులు సరిచేసి, రైతులకు తప్పులు లేకుండా పాసుపుస్తకలను అందించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనిని ఎంతో సమర్ధవంతంగా నిర్వహించారనె ఉద్దేశ్యంతో ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చామని, కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూడు నెలల శ్రమ బూడిదలో పోసిన పన్నీరులాగ మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో సంక్లిష్టమైన ఈ పనికి పూనుకొంటే, పాసుపుస్తకాలలో దొర్లిన తప్పులు కారణంగా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని సిఎం కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

 కనుక మళ్ళీ నేటి నుంచి జూన్ 20 వరకు అధికారులు, ఉద్యోగులు అందరూ గ్రామాలకు వెళ్లి పాసుపుస్తకంలో దొర్లిన తప్పులను సవరించి, ప్రతీ రైతుకు సకాలంలో పాసుపుస్తకం అందేలా చూడాలని ఆదేశించారు. ఈపనులు పూర్తయ్యే వరకు వేరే పనులు పెట్టుకోవద్దని సిఎం కెసిఆర్ అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

దీనికోసం జిల్లాకు ఒకరు చొప్పున 30 మంది ప్రత్యేకాధికారులను తక్షణమే నియమించారు. ఈసారి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాతే రాష్ట్రంలో భూముల వివరాలను తెలియజేసే ధరణి వెబ్ సైటును ప్రారంభిద్దామని కెసిఆర్ అన్నారు. 


Related Post