ఆర్.టి.సి.కార్మికుల గోడు ఎవరికి మోరపెట్టుకోవాలి?

May 24, 2018


img

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాద్యాయులకు డిఏ, వేతన సవరణ, బదిలీలు వంటి అనేక వరాలు గిప్పించిన సిఎం కెసిఆర్, ఆర్.టి.సి.ఉద్యోగుల పట్ల చాలా కరుకుగా వ్యవహరించడంతో వారు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధపడుతున్నారు. ఆర్టీసి నష్టాలలో నడుస్తుంటే ఉద్యోగులుకు జీతాలు పెంచాలని డిమాండ్ చేయడం సరికాదని, ఒకవేళ వేతన సవరణ కోసం సమ్మె చేస్తామంటే చేసుకోమని సిఎం కెసిఆర్ అన్నారు. సమ్మె చేస్తే చివరికి ఆర్.టి.సి.మూతపడుతుందని, అప్పుడు ఉద్యోగులే రోడ్డున పడతారని సిఎం కెసిఆర్ హెచ్చరించారు. 

అయన హెచ్చరికలు ఆర్.టి.సి. ఉద్యోగులను మరింత రెచ్చగొట్టినట్లయింది. అధికారుల నిర్లక్ష్యం, అసమర్దత, డీజిల్, బస్సు విడిభాగాల ధరలు పెరుగుదల కారణంగా ఆర్.టి.సి.నష్టపోతుంటే, సంస్థను కాపాడుకోవడం కోసం తామంతా రేయింబవళ్ళు కష్టపడుతున్న తమను సిఎం కెసిఆర్ నిందించడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నానాటికీ అన్నిటి ధరలు పెరిగిపోతున్నప్పుడు, జీతాలు పెంచకపోతే తాము ఏవిధంగా బ్రతకాలి? తమ గోడు ఎవరికీ మోర పెట్టుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. 

తమ ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, దానిపై ఒత్తిడి చేసి వేతన సవరణ సాధించుకునేందుకు తెలంగాణ ఆర్.టి.సి.జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆర్.టి.సి. ఉద్యోగులు, కార్మికుల గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ వద్ద గల లేబర్ కమీషనర్ కార్యాలయం ముందు ధర్నా చేయబోతున్నారు. ఇకనైనా సిఎం కెసిఆర్ తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని లేకుంటే సమ్మె అనివార్యమని హెచ్చరిస్తున్నారు.


Related Post