నేడే కెసిఆర్ బెంగళూరు ప్రయాణం

May 22, 2018


img

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమానికి ఆహ్వానించబడిన వారిలో తెలంగాణా సిఎం కెసిఆర్ కూడా ఒకరు. కానీ బుధవారం హైదరాబాద్ లో అయన అనేక అత్యవసర సమావేశాలలో పాల్గొనవలసి ఉంది కనుక మంగళవారం సాయంత్రమే బెంగళూరు వెళ్లి కుమారస్వామిని అభినందించి మళ్ళీ రాత్రికే హైదరాబాద్ తిరిగి వచ్చేస్తారు. 

కానీ అసలు కారణం అందరికీ తెలిసిందే. జెడిఎస్, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటుచేస్తునందున సిఎం కెసిఆర్ వారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావడంలేదని చెప్పవచ్చు. హాజరైతే తెలంగాణా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించినట్లవుతుంది. తన రాజకీయ ప్రత్యర్ధులకు తనను విమర్శించేందుకు అవకాశం కల్పించినట్లవుతుంది. బహుశః అందుకే సిఎం కెసిఆర్ ఒకరోజు ముందుగానే కుమారస్వామిని అభినందించి తిరిగి వచ్చేస్తున్నారని భావించవచ్చు. 

కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాయావతి, కేరళ, ఆంద్రా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ తదితరులను ఆహ్వానించినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ అయన ఈ కార్యక్రమానికి హాజరవబోతున్నట్లు సమాచారం.    



Related Post