తెలంగాణాలో అవినీతి పెరిగింది: సురేష్ చందా

May 22, 2018


img

ఇప్పటి వరకు ఐఏఎస్,ఐపిఎస్ తదితర ఉన్నతాధికారులకు ఎంత చిత్తశుద్ధితో కష్టపడిచేసినా వారికి ఎటువంటి గుర్తింపు లభించేది కాదు. కానీ తెలంగాణా ప్రభుత్వం వారి సేవలకు కూడా తగిన గుర్తింపు లభించాలనే ఉద్దేశ్యంతో ‘తెలంగాణా ఎక్సలెన్సీ’ అవార్డులను ప్రవేశపెట్టింది. 

హైదరాబాద్ లోని ఎం.సి.ఆర్. హెచ్.ఆర్.డి.లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి కేటిఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తో సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్దిక సంఘం కార్యదర్శి సురేష్ చందా “తెలంగాణా రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, అవినీతిలో తెలంగాణా దేశంలో అగ్రస్థానంలో ఉందని సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ సంస్థ పేర్కొందని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. 

సురేష్ చందా ఏమన్నారంటే, “దేశంలో అవినీతి పెరిగిపోయింది. వారణాసిలో ఫ్లై ఓవర్ కూలి అనేకమంది ప్రజలు చనిపోతే, పోస్ట్ మార్టం తరువాత వారి శవాలను తిరిగి ఇవ్వడానికి ఆసుపత్రి సిబ్బంది లంచాల కోసం వారి బంధువులను పీడించారు. అవినీతికి తెలంగాణా రాష్ట్రం కూడా అతీతం కాదు. ప్రభుత్వాసుపత్రులలో లంచాలు లేకుండా వైద్యం జరుగదు. రాష్ట్రంలో గత ఒక్క ఏడాదిలోనే 73 శాతం కుటుంబాలు ప్రభుత్వాధికారులకు లంచాలు ఇచ్చినట్లు సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ సంస్థ పేర్కొంది. 

మన దేశం సిఫార్సుల దేశం. ప్రతీ పనికి ఒక సిఫార్సు లేఖ తప్పనిసరి. ఈ ‘తెలంగాణా ఎక్సలన్సీ’ అవార్డుల కోసం కూడా అనేక సిఫార్సులు వచ్చాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అవినీతి సంపాదనకు అలవాటుపడిన ప్రభుత్వాధికారులు ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేయకుండా తొక్కిపట్టి ఉంచుతున్నారు. లంచాల కోసం ఫైల్స్ పై కొర్రీలు వేస్తూ కాంట్రాక్టర్లను వేధిస్తున్నారు. కనుక బిల్లులు చెల్లింపు విధానంలో పారదర్శకత కోసం ఆన్-లైన్ విధానం అమలుచేయాలి. పంజాబ్ తరహాలో పౌరసేవలను సరళీకృతం చేయాలి. ఏ ఫైల్ ఏ అధికారి వద్ద ఉందో తెలుసుకొనేందుకు వీలుగా ఫైళ్ళ కదలికలను కూడా ఆన్-లైన్ విధానంలోకి మార్చాలి. 

నేను సాంకేతికంగా ప్రభుత్వం బయట ఉన్నాను కనుక ప్రభుత్వంలో ఏమి జరుగుతోందో తెలుసుకొనే అవకాశం నాకు కలిగింది. రాజకీయ అవసరాల కోసం అధికార దుర్వినియోగాన్ని అడ్డుకట్టవేయాల్సి ఉంది. రాజకీయ నాయకత్వం, ప్రభుత్వాధికారులు చిత్తశుద్ధితో సమన్వయంతో పనిచేసినప్పుడే అవినీతికి అడ్డుకట్టవేయడం సాధ్యం అవుతుంది,” అని సురేష్ చందా అన్నారు.     

సురేష్ చందా చేసిన ఈ వ్యాఖ్యలపై అదే వేదికపై ఉన్న కేటిఆర్, కడియం శ్రీహరి వెంటనే స్పందించారు. మంత్రి కేటిఆర్ ప్రసంగిస్తూ, “అవినీతి జరిగినప్పుడు అది ఎవరు చేశారు? ఎందుకు, ఎలా జరిగింది?దానికి ఏవిధంగా ఆస్కారం కలిగింది?అని ఆలోచించి దానిని పరిష్కరించుకోవాలి తప్ప కొందరు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం వలన, అధికారులతో సమీక్షా సమావేశాలు, టెలీ కాన్ఫరెన్సులు అంటూ హడావుడి చేయడం వలన  ఈ సమస్య పరిష్కారం కాదు. అయినా ఇటువంటి సమస్యల గురించి మాట్లాడేందుకు సరైన వేదిక, మార్గాన్ని ఎంచుకోవడం కూడ చాలా అవసరమే,’ అని కేటిఆర్ సున్నితంగా చురకలు వేశారు.

ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ, “ఎవరో కొందరు అవినీతికి పాల్పడితే రాజకీయ నేతలు, అధికారులు అందరూ అవినీతిపరులే అన్నట్లు మాట్లాడటం సరికాదు. ఇప్పటికే ప్రజలకు శాసన వ్యవస్థలపై, న్యాయవ్యవస్థలపై, అధికార గణంపై రాన్రాను నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ పరిస్థితులలో ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకొంటే ప్రజలకు మనపై నమ్మకం ఇంకా సన్నగిల్లుతుంది. ఒకవేళ ఏ అధికారైనా తన వద్ద ఉన్న ఫైల్స్ పై తగిన నిర్ణయం తీసుకోలేని పక్షంలో వాటిని సంబంధిత శాఖ మంత్రులకు తిప్పి పంపినట్లయితే, వాటిపై ఆ మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రి గానీ తగిన నిర్ణయం తీసుకొంటారు. ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు, వేరొకరి గురించి ముందే ఒక అభిప్రాయం ఏర్పరచుకొని వారిని అదే దృష్టితో చూడటం సరికాదు. ప్రభుత్వం వ్యవస్థలో అందరూ భాగస్వాములేనని అందరూ గుర్తుంచుకోవాలి,” అని అన్నారు.


Related Post