తెలంగాణాలో కూడా కాంగ్రెస్-తెరాసలు పొత్తులు?

May 22, 2018


img

రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ కాంగ్రెస్, తెరాసలపై విరుచుకుపడ్డారు. భాజపా దక్షిణాది జైత్రయాత్రను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీతో జెడిఎస్, తెరాసలు చేతులు కలిపాయని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికలలో పరస్పరం కత్తులు దూసుకొన్న కాంగ్రెస్-జెడిఎస్ పార్టీలు ఎన్నికల తరువాత చేతులు కలిపి దొడ్డిదారిన భాజపా ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకున్నాయని లక్ష్మణ్ అవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలో భాజపాను అడ్డుకోవడానికే పరస్పరవిరుద్దమైన సిద్దాంతాలు కలిగిన ఆ రెండు పార్టీలు చేతులు కలిపాయని, వాటిది అనైతిక, అపవిత్రమైన కలయిక అని లక్ష్మణ్ అన్నారు. 

జాతీయ పార్టీ అని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయపార్టీ కంటే చిన్నదిగా మారిపోవడంతో, భాజపాను నేరుగా ఎదుర్కోలేక ఇలా ప్రాంతీయపార్టీలతో అనైతిక, అపవిత్రమైన పొత్తులు పెట్టుకోవడానికి కూడా వెనుకాడటం లేదని లక్ష్మణ్ అన్నారు. వాట్టికి తెరాస మద్దతు ఇవ్వడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. కెసిఆర్ స్థాపిస్తున్నది ఫెడరల్ ఫ్రంట్ కాదు ఫ్యామిలీ ఫ్రంట్ లేదా ప్రైవేట్ ఫ్రంట్ అని అన్నారు లక్ష్మణ్. 

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు జెడిఎస్ కు తెరాస సహకరించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి సహకరించినట్లే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణాలో కూడా కాంగ్రెస్, తెరాసలు చేతులు కలిపినా ఆశ్చర్యం లేదన్నారు. ఇదంతా భాజపాను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పెద్ద కుట్ర  అని లక్ష్మణ్ అభివర్ణించారు. 

తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న బస్సు యాత్రలు కూడా భూటకమని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో కత్తులు దూసుకొంటున్నట్లు నటిస్తున్న కాంగ్రెస్-తెరాసలు కర్ణాటకలో చేతులు కలిపి ప్రజలను వంచించాయని అన్నారు. తెలంగాణాలో కూడా భవిష్యత్ లో కాంగ్రెస్-తెరాసలు చేతులు కలపడం ఖాయం అని లక్ష్మణ్ అన్నారు. 


Related Post