ఎడ్యూరప్ప రాజీనామాపై ఎవరేమన్నారంటే..

May 19, 2018


img

నటుడు ప్రకాష్ రాజ్: కర్ణాటక కాషాయరంగు పులుముకోబోవడం లేదు కానీ ఇప్పుడు ఇంకా చాలా రంగులమయంగా ఉంది. ఆట మొదలు పెట్టకముందే అయిపోయింది. 56 (మోడీ ఛాతి కొలత) గురించి మరిచిపోండి. కనీసం 55 గంటలు నిలబడలేకపోయారు. ఇక దీనిపై జోక్స్‌ సరేసరి. డియర్ సిటిజన్స్..మరిన్ని చెత్త రాజకీయాలను ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలి. 

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి: కర్ణాటక వ్యవహారం భాజపాకు ఒక గుణపాఠం వంటిది. మతతత్వంపై ప్రజాస్వామ్యమే గెలిచింది.   

గీతారెడ్డి, పీఏసీ ఛైర్మెన్: ఇది ప్రజాస్వామ్య విజయం. ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన సుప్రీంకోర్టుకి, మీడియాకి ధన్యవాదాలు. నియంతలా వ్యవహరించిన బీజేపీకి తగినగుణపాఠం లభించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈ ఫలితాలే పునాదివంటివి. 

ఏపి మంత్రులు గంటా శ్రీనివాస రావు, చిన రాజప్ప: కర్ణాటకలో భాజపా అనైతిక చర్యలకు పాల్పడినప్పటికీ బలనిరూపణ చేసుకోలేక అభాసుపాలైంది. కర్ణాటకలో అమిత్ షా కుట్రలు ఏవీ ఫలించలేదు. భాజపాకు మెజార్టీ రాకపోయినా గవర్నర్ చేత చేయకూడని పనులు చేయించి భాజపా అప్రదిష్ట మూటకట్టుకొంది.   

బిఎస్.పి. అధినేత్రి మాయావతి:  దక్షిణాది రాష్ట్రాలపై దండయాత్ర అంటూ బయలుదేరిన భాజపాకు గట్టి పట్టున్న కర్ణాటకలోనే ఎదురుదెబ్బ తగిలింది. 2019 ఎన్నికలలో మళ్ళీ గెలిచి కేంద్రంలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న భాజపాకు ఇది పెద్ద దెబ్బే. కనీసం ఇప్పటికైనా తీరు మార్చుకొంటే మంచిది.

స్టాలిన్ (డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్): భాజపా తను అధికారంలో లేని చోట్ల గవర్నర్ల ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. అందుకు తమిళనాడు దాని తరువాత కర్ణాటక తాజా ఉదాహరణలుగా నిలుస్తాయి. రెండు చోట్ల ఆవిధంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలనే దాని ప్రయత్నాలు బెడిసికొట్టాయి.


Related Post