ఏమప్పా...ఎడ్యూరప్పా..

May 19, 2018


img

కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. ఈరోజు ఉదయం వరకు కూడా ‘బలపరీక్షలో మేమే నెగ్గుతాము..ఈరోజు సాయంత్రం ఘనంగా వేడుకలు చేసుకొంటాము,’ అని చెప్పిన ఎడ్యూరప్ప, ఈరోజు బలపరీక్ష ఎదుర్కోకముందే తన పదవికి రాజీనామా చేయడం విశేషం. 

కాంగ్రెస్, జెడిఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి లొంగదీసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో బలపరీక్షలో నెగ్గలేమని గ్రహించిన ఎడ్యూరప్ప శాసనసభలో సుదీర్ఘ ప్రసంగం చేసిన తరువాత తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

శాసనసభ నుంచి నేరుగా రాజ్ భవన్ వెళ్ళి గవర్నర్ కు తన రాజీనామా పత్రం సమర్పించబోతున్నారు. ఇక ఎడ్యూరప్ప దిగిపోయారు కనుక జెడిఎస్ నేత కుమారస్వామిని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైంది. ఒకటి రెండు రోజులలో కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.   

మే 17 ఉదయం 9 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎడ్యూరప్ప మే 19 సాయంత్రం 4 గంటల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. అంటే కేవలం 55 గంటలు ముఖ్యమంత్రిగా ఉన్నారన్న మాట. ఈవిధంగా కూడా ఎడ్యూరప్ప ఒక సరికొత్త రికార్డు సృష్టించారని చెప్పవచ్చు. 

అధికారం దక్కించుకోవడం కోసం ఎడ్యూరప్ప శతవిధాలుగా ప్రయత్నించారు. ఆయన ప్రభుత్వాన్ని కాపాడటానికి గవర్నర్ వజూభాయ్ కూడా ఉడతాభక్తిగా చేతనైన సాయం చేశారు. కానీ మద్యలో సుప్రీంకోర్టు కలుగజేసుకొని 24గంటల వ్యవధిలోనే బలనిరూపణ చేసుకోవలసిందిగా ఆదేశించడంతో ఎడ్యూరప్ప& కో దెబ్బతిన్నారు. భాజపా 104 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, న్యాయంగా ధర్మబద్దంగా వ్యవహరించి ఉండి ఉంటే కనీసం గౌరవం దక్కేది. కానీ వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు, నీచరాజకీయాలు చేసినా చేతికి అందిన అధికారానని నిలబెట్టుకోలేకపోయింది. పైగా ఎడ్యూరప్పను నమ్ముకొన్నందుకు అప్రదిష్టపాలైంది. ఈ రాజకీయ చదరంగంలో ఎడ్యూరప్ప ఓడిపోయినందుకు కాంగ్రెస్, జెడిఎస్ పార్టీల కంటే దేశప్రజలే ఎక్కువ సంతోషిస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 


Related Post