ఆయనే ప్రోటెం స్పీకర్ కానీ...

May 19, 2018


img

కర్ణాటక గవర్నర్ భాజపా ఎమ్మెల్యే కెజి బొప్పయ్యను ప్రోటెం స్పీకర్ గా నియమించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పుడు ఆయనకు నోటీస్ ఇచ్చినట్లయితే ఈరోజు సాయంత్రం జరుగవలసిన బలపరీక్ష వాయిదా పడుతుందని కనుక ఆయననే ప్రోటెం స్పీకర్ గా కొనసాగనిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అయితే అయన శాసనసభలో భాజపాకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందనే కాంగ్రెస్ భయాలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకొని, శాసనసభలో బలపరీక్ష కార్యక్రమాన్ని లైవ్ లో అన్ని న్యూస్ ఛానల్స్ లో ప్రసారం చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు తమ పిటిషన్ ను తిరస్కరించినప్పటికీ బలపరీక్ష కార్యక్రమాన్ని లైవ్ లో చూపాలని ఆదేశించినందుకు కాంగ్రెస్ పార్టీ సంతృప్తి వ్యక్తం చేసింది.

సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కనుక కాంగ్రెస్, జెడిఎస్, భాజపా, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు అందరూ కొద్దిసేపటి క్రితమే కర్ణాటక శాసనసభకు చేరుకొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో సహా అన్ని పార్టీల శాసనసభ్యులు ప్రమాణస్వీకారాలు చేశారు. 

కాంగ్రెస్, జెడిఎస్ శాసనసభ్యులందరూ ఇప్పుడు శాసనసభలో భాజపా కళ్ళెదుటే ఉన్నారు. బలనిరూపణకు ఇంకా సాయంత్రం 4 గంటల వరకు సమయం ఉంది. ఈరోజు ఉదయం నుంచే శాసనసభ కార్యక్రమాలన్నీ లైవ్ లో ప్రసారం అవుతున్నప్పటికీ, ఆలోగా వారిలో తమకు అనుకూలంగా ఉన్నవారిని గుట్టుగా తమవైపు తిప్పుకోవడానికి భాజపా ప్రయత్నించకుండా ఉండదు. దాని ప్రయత్నాలను కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలు సమర్ధంగా అడ్డుకోలేకపోతే ఇక అధికారం మీద ఆశలు వదులుకోవలసిందే. కనుక సాయంత్రం 4 గంటలలోగా ఏదైనా జరుగవచ్చు. 

ఈరోజు జరుగబోయే బలపరీక్షలో ఖచ్చితంగా తామే గెలుస్తామని, బలపరీక్షలో నెగ్గిన తరువాత ఈరోజు సాయంత్రం ఘనంగా వేడుకలు జరుపుకొబోతున్నామని ఎడ్యూరప్ప పూర్తినమ్మకంతో చెప్పడం విశేషం. అయన మాటలను తేలికగా తీసుకోలేము. ఎందుకంటే, గవర్నర్ నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు తనకు ఆహ్వానం రాకముందే, మే 17 ఉదయం 9 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని ఎడ్యూరప్ప ప్రకటించారు. అలాగే జరిగింది కూడా. కనుక ఇప్పుడు కూడా ఎడ్యూరప్ప మాటలే నిజమవబోతున్నాయా? అందుకే ఆయన అంత నమ్మకంగా చెపుతున్నారా? ఏమో? సాయంత్రం 4గంటలలోపే ఈ సస్పెన్స్ వీడిపోవచ్చు. అంతవరకు వేచి చూడవలసిందే.  


Related Post