ఆహ్వానిస్తారా...ధర్నా చేయమంటారా?

May 16, 2018


img

కర్ణాటకలో కాంగ్రెస్, జెడిఎస్ ఎమ్మెల్యేలను లొంగదీసుకోనేందుకు భాజపా చేస్తున్న ప్రయత్నాలను, ఆడుతున్న మైండ్ గేమ్స్ చూసి ఆ రెండు పార్టీలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. “తమ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికీ రూ.100 కోట్లు, మంత్రి పదవి ఇస్తామని ప్రలోభ పెడుతున్నారని జెడిఎస్ నేత కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. తాను భాజపా నేతలతో రహస్య సమావేశం అయ్యానని భాజపా పుకార్లు పుట్టిస్తూ మాపార్టీ ఎమ్మెల్యేలలో అయోమయం సృష్టించే ప్రయత్నాలు  చేస్తోందని ఆరోపించారు. 

కుమారస్వామి మాటలను బట్టి జెడిఎస్-కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఎంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఒక్కో గంట గడుస్తున్న కొద్దీ కొంతమంది ఎమ్మెల్యేలు చేజారిపోయే ప్రమాదం కనిపిస్తుండటంతో, ఈరోజు సాయంత్రం 5గంటలకు కాంగ్రెస్-జెడిఎస్ నేతలు మళ్ళీ మరోమారు గవర్నర్ ను కలిసి, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమను ఆహ్వానించవలసిందిగా కోరడానికి తమ తమ ఎమ్మెల్యేలతో కలిసి రెండు బస్సులలో రాజ్ భవన్ కు తరలివచ్చారు. కానీ వారిని గవర్నర్ సెక్యూరిటీ సిబ్బంది లోపలకు అనుమతించకపోవడంతో గేటు వద్ద ఆందోళనకు సిద్దం అవుతున్నారు. 

ఒకవేళ ఈరోజు రాత్రిలోగా గవర్నర్ ఎటువంటి నిర్ణయమూ తీసుకోకుంటే రేపు ఉదయమే జెడిఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజ్ భవన్ ఎదుట ధర్నాకు కూర్చోవాలని నిర్ణయించారు. ఒకవేళ గవర్నర్ తమను కాదని భాజపాను ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తే వెంటనే సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. 

అయితే కాంగ్రెస్, జెడిఎస్ నేతల ఆరోపణలను కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఖండించారు. వందకోట్లు చిన్న మొత్తమేమీ కాదని, ఒక్కో ఎమ్మెల్యేకు అంతడబ్బు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పంచిపెట్టగలదని అన్నారు. కాంగ్రెస్ నేతలకు డబ్బులు, పదవులు ఎరవేసి ఫిరాయింపులు చేయించడం వెన్నతో పెట్టిన విద్య కనుకనే అది ఇటువంటి ఆరోపణలు చేస్తోందని జవదేకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దొడ్డి దోవన అధికారం చేపట్టడానికి నీచ రాజకీయాలు చేస్తోందని, కానీ తమ పార్టీ రాజ్యాంగ నిబంధనలకు లోబడి నడుచుకొంటోందని అన్నారు. తమకు తగినంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది కనుకనే గవర్నర్ ఆహ్వానిస్తే ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని మంత్రి జవదేకర్ అన్నారు. 

భాజపాకు కేవలం 104 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పాటుకు 113మంది అవసరం. కానీ ఎడ్యూరప్పతో సహా భాజపా నేతలందరూ తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగినంతమంది ఎమ్మెల్యేలున్నారని నమ్మకంగా చెప్పుతున్నారు. అంటే మరో 9మంది కాంగ్రెస్ లేదా జెడిఎస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోగలిగారని లేదా ఆ ప్రయత్నాలలో ఉన్నారని అర్ధం అవుతోంది. భాజపా చెపుతున్న నీతులను, అధికారం కోసం అది తెర వెనుక చేస్తున్న పనులకు పొంతనలేదని స్పష్టమవుతోంది. 


Related Post