భాజపా ఎల్.పి.నేతగా ఎడ్యూరప్ప

May 16, 2018


img

ఊహించినట్లుగానే అవినీతి ఆరోపణలలో జైలుకు వెళ్ళి వచ్చిన ఎడ్యూరప్పను కర్ణాటక భాజపా శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. బెంగళూరు నగరంలోగల భాజపా కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం ముగిసిన శాసనసభాపక్ష సమావేశానికి కేంద్రమంత్రులు ప్రకాష్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్, జెపి నడ్డా హాజరయ్యారు. 

శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన వెంటనే ఎడ్యూరప్ప భాజపా నేతలతో కలిసి గవర్నర్ వజుభాయ్‌ వాలాను కలిసేందుకు రాజ్ భవన్ వెళ్ళారు. భాజపా శాసనసభాపక్ష నేతగా తను ఎన్నికైనట్లు ఆయనకు తెలియజేసి, అతిపెద్దపార్టీగా నిలిచిన తమకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని, బలనిరూపణకు కొంత సమయం ఇవ్వాలని ఎడ్యూరప్ప గవరనర్ ను కోరబోతున్నారు.   

224 మంది శాసనసభ్యులు కలిగిన కర్ణాటక శాసనసభలో ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 113 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ నిన్న విడుదలైన ఎన్నికల ఫలితాలలో భాజపాకు 104 సీట్లు మాత్రమే వచ్చాయి. కనుక జెడిఎస్ మద్దతు తప్పనిసరి అయ్యింది. ఇప్పటికే ముగ్గురు జెడిఎస్, ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎడ్యూరప్ప తన దారికి తెచ్చుకొన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఈరోజు జరిగిన కాంగ్రెస్, జెడిఎస్ శాసనసభాపక్ష సమావేశాలకు డుమ్మా కొట్టారు. కనుక వారు చేజారిపోయినట్లే భావించవచ్చు. 

గవర్నర్ అనుమతిస్తే తక్షణమే తమకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను రాజ్ భవన్ లో పెరేడ్ చేయించడానికి కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలు సిద్దంగా ఉన్నాయి. కానీ గవర్నర్ ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో ప్రస్తుతం బెంగళూరులో క్యాంప్ రాజకీయాలు చాలా జోరుగా సాగుతున్నాయి. రేపటిలోగా భాజపా, కాంగ్రెస్-జెడిఎస్ లలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందనే విషయంపై స్పష్టతరావచ్చు.


Related Post