గోదావరిలో లాంచి బోల్తా..

May 15, 2018


img

గోదావరి నదిలో మంగళవారం మధ్యాహ్నం ఒక లాంచీ బోల్తా పడింది. ఆ సమయంలో లాంచీలో స్థానిక గిరిజనులతో ఒక పెళ్ళి బృందంతో కలిపి మొత్తం 60 మంది ఉన్నట్లు సమాచారం. లాంచీ నీటమునగగానే వారిలో 6 మంది ఈదుకొంటూ ఒడ్డుకు చేరుకోగలిగారు. మిగిలిన ప్రయాణికులు అందరూ గల్లంతైనట్లు సమాచారం. నదిలో లాంచీ ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా పెద్ద సుడిగాలి వీచడంతో లాంచీ అదుపుతప్పి బోల్తా పడినట్లు ఒడ్డుకు ఈదుకు వచ్చినవారు తెలిపారు. నదిలో లాంచీ మునిగిపోవడం చూసిన సమీపంలోని లంక గ్రామాల ప్రజలు నాటుపడవలు వేసుకొని ప్రమాదస్థలానికి చేరుకొని నీటమునిగిన ప్రయాణికులను రక్షించే ప్రయత్నాలు చేశారు. ఈ సమాచారం అందుకొన్న పోలీసులు, ఎన్జీఎఫ్ సహాయా బృందాలు అక్కడకు చేరుకొని 22 మరబోట్లు సహాయంతో నదిలో గాలింపు చర్యలు మొదలుపెట్టారు.   

పోలవరం నుంచి ఒడ్డుకు అవతలివైపున్న కొండమొదలు అనే గ్రామానికి లాంచీ వెళుతుండగా తూర్పు గోదావరి జిల్లాలో దేవీపట్నం మండలంలో మంటూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది.   

ప్రమాదానికి గురైన లాంచీ స్థానిక లక్ష్మీవెంకటేశ్వర లాంచీ సర్వీస్ కు చెందినదిగా గుర్తించారు. దాని నిర్వాహకుడు ఖాజా దేవీపట్నం పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. 

సరిగ్గా నాలుగు రోజుల క్రితమే దేవీపట్నం మండలంలో వీరవరపులంక గ్రామం సమీపంలో గోదావరి నదిలో పాపికొండలు యాత్రకు బయలుదేరిన ఒక టూరిస్ట్ బోటులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కానీ లాంచీ డ్రైవర్ సమయస్పూర్తితో లాంచీని సమీపంలో ఉన్న ఒడ్డుకు చేర్చడంతో దానిలో ప్రయాణిస్తున్న 120 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడగలిగారు. వారు లాంచీలో నుంచి క్రిందకు దిగిన రెండు మూడు నిమిషాల వ్యవధిలోనే లాంచీ మొత్తం కాలి బూడిదైపోయింది. ఆ సంఘటన ఇంకా కళ్ళలో మెదులుతుండగానే ఇవాళ్ళ ఈ ప్రమాదం జరిగింది. 



Related Post