త్వరలో గవర్నర్ మార్పు?

April 26, 2018


img

కాంగ్రెస్ హయంలో సమైక్య రాష్ట్రానికి గవర్నర్ గా నియమింపబడిన నరసింహన్ రాష్ట్ర విభజన తరువాత కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగుతున్నారు. గత 11 ఏళ్ళుగా గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఆయన అనేక ఒడిదుడుకులు, తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్ళు, తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. 

రెండు రోజుల క్రితం ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. తనకు వ్యతిరేకంగా కేంద్రం చేస్తున్న కుట్రలలో పాలుపంచుకొంటున్నారని, తనకు వ్యతిరేకంగా ప్రతిపక్షపార్టీలను కూడగడుతున్నారని, అయన గవర్నర్ లా కాకుండా ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిలా వ్యవహరిస్తునారని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ పరిణామాలపై గవర్నర్ నరసింహన్ స్పందిస్తూ, “ఎవరైనా ఎంతకాలం ఒక పదవిలో ఉంటారు? నాకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాను. ఇప్పుడు నాపై విమర్శలు చేస్తున్న మీడియా, నేతలే రేపు నేను పదవిలో నుంచి దిగిపోయాక నన్ను ప్రశంసిస్తారు. నేను ఎవరి ప్రభుత్వాలు కూలద్రోయాలని ప్రయత్నించడం లేదు. అటువంటి అవసరం నాకు లేదు కూడా. నేను మొట్ట మొదట గవర్నర్ గా బాధ్యతలు చేపట్టడానికి వచ్చినప్పటి నుంచి అనేకసార్లు నాపై ఇటువంటి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కానీ నేనెప్పుడు రాజ్యంగా విరుద్దమైన పనులు చేయలేదు. నేను దేవాలయాలు దర్శించుకోవడంపై కూడా విమర్శలు చేస్తుండటం చాలా బాధ కలిగించింది. నేను నా విధులు విస్మరించి గుళ్ళుగోపురాలకు తిరగడం లేదు కదా?ఈరోజు నేను గుళ్ళు గోపురాలకు తిరుగుతున్నానని, రాజకీయాలు చేస్తున్నానని నన్ను విమర్శించినవారే రేపు నన్ను మెచ్చుకొంటారు. ఇక మీడియాలో వస్తున్న వార్తలను చూసే ఏపి సిఎం చంద్రబాబు ఆవిధంగా స్పందించి ఉంటారు తప్ప అయన మనసులో నాగురించి చెడు అభిప్రాయం ఉందనుకొను. ఇప్పటికీ నేను అయనను ఒక మంచి స్నేహితుడిగానే భావిస్తున్నాను,” అని అన్నారు. 

అయన సుదీర్గకాలంపాటు గవర్నర్ గా వ్యవహరించినందున, ఇంకా ఏపిలో మారిన రాజకీయ సమీకరణల దృష్ట్యా కేంద్రం అయన పదవీ కాలం మళ్ళీ పొడిగించే అవకాశం లేదని, ఏపి, తెలంగాణా రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించవచ్చని, అందుకే అయన డిల్లీ పెద్దలను కలవకుండానే తిరిగి వచ్చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Related Post