గుత్తా నియామకం తప్పు కాదు కానీ...

April 25, 2018


img

తెలంగాణా రైతు సమన్వయ సమితి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు అనూహ్యంగా స్పందించింది. లోక్ సభ సభ్యులుగా ఉన్నవారు లాభదాయకమైన పదవులు చేపట్టడం రాజ్యంగా విరుద్దమని, కనుక గుత్తా సుఖేందర్ రెడ్డి నియామకం చట్ట విరుద్దమని ప్రకటించాలని కోరుతూ భాజపా నేత గోలి మధుసూదన్ రెడ్డి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాధన్ నేతృత్వంలో ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. 

ఈ సందర్భంగా న్యాయమూర్తి రమేష్ రంగనాధన్ అనూహ్యంగా స్పందించారు. “ఎంపిగా ఉన్న వ్యక్తి లాభదాయకమైన పదవిని చేపడితే ఎంపి పదవి కోల్పోతారు తప్ప అతని నియామకాన్ని ఏవిధంగా తప్పు పట్టగలము? కనుక ఆయన నియామకాన్ని చట్టవిరుద్దమని ప్రకటించలేము” అని అన్నారు. తరువాత దీనిపై విచారణను మే 1వ తేదీకి వాయిదా వేశారు.

హైకోర్టు న్యాయమూర్తి స్పందన విచిత్రంగా అనిపించవచ్చు కానీ కాస్త లోతుగా ఆలోచిస్తే అది సరైనదేనని అర్ధం అవుతుంది. ఈ కేసులో పిటిషనర్ గుత్తా సుఖేందర్ రెడ్డి నియామకాన్ని చట్ట విరుద్దంగా ప్రకటించాలని కోరారు కానీ అయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరలేదు. కోరి ఉండి ఉంటే న్యాయస్థానం స్పందన వేరే విధంగా ఉండేది. అంటే పిటిషన్ లోనే లోపం ఉందని అర్ధం అవుతోంది. కనుక ఈసారి ఆ పిటిషనర్ లేదా మరెవరైనా గుత్తా సుఖేందర్ రెడ్డి లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ మరో కొత్త పిటిషన్ వేసినా ఆశ్చర్యం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేదా రేవంత్ రెడ్డి ఆ పని చేస్తారేమో?


Related Post