తెరాస ప్లీనరీలో ఆరు తీర్మానాలు

April 24, 2018


img

తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న కొంపల్లిలో తెరాస ప్లీనరీసమావేశం జరుగబోతోంది. ఈసారి ఒక రోజుకే ప్లీనరీని పరిమితం చేసి దాని గురించి ఏమాత్రం హడావుడి చేయకుండా నిశబ్దంగా ఏర్పాట్లు పూర్తి చేస్తుండటం విశేషం. ఎన్నికలకు ముందు నవంబర్ నెలలో తెరాస సత్తాను చాటేవిధంగా 20-25 లక్షల మందితో హైదరాబాద్ లో బారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తునందున ప్లీనరీని ఒక్కరోజుకే పరిమితం చేసినట్లు తెరాస నేతలు చెపుతున్నారు. 

ఈ ప్లీనరీకి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల నుంచి సుమారు 13,000 మంది హాజరుకాబోతున్నారు. వందమంది ఎన్ఆర్ఐలు కూడా హాజరుకాబోతున్నట్లు మంత్రి కేటిఆర్ చెప్పారు. ఇతర పార్టీల నేతలెవరినీ దీనికి ఆహ్వానించలేదని మంత్రి కేటిఆర్ చెప్పారు. 

ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ ప్లీనరీ సమావేశం జరుగుతుంది. దానిలో జాతీయ రాజకీయాలు, వ్యవసాయం, సంక్షేమం, మౌలికవసతుల కల్పన, పాలనా సంస్కరణలు అనే 6 అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించుకోబోతున్నట్లు తెరాస నేతలు చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 27నాటికి సార్వత్రిక ఎన్నికలు వచ్చేస్తాయి కనుక ఈసారి ప్లీనరీలోనే తెరాస శ్రేణులను ఎన్నికలకు సిద్దం చేసేవిధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ దిశానిర్దేశం చేస్తారు.


Related Post