గమనిక: మేము కాంగ్రెస్ లో చేరడం లేదు

April 24, 2018


img

నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్లే రాజకీయాలలో నైతిక విలువలు కూడా కనబడవు. అవి కేవలం మాటలకే పరిమితమని అందరికీ తెలుసు. నైతిక విలువల గురించి లెక్చర్లిస్తూనే మరోవైపు రాజకీయ ప్రత్యర్దులను నైతికంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. అటువంటి ప్రయత్నాలలో భాగంగానే తమపై కొందరు సోషల్ మీడియాలో పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని తెరాస ఎమ్మెల్యే కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె తన భర్త కొండా మురళితో కలిసి వరంగల్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 

“మేము త్వరలో డిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నామని సోషల్ మీడియాలో పుకార్లు సృష్టిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఆ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. మేము అంటే గిట్టనివాళ్ళు ఎవరో మాపై ఈ పుకార్లు వ్యాపింపజేస్తూ మాతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇటువంటి ఎత్తులు మాదగ్గర చెల్లవు. మేము వాటిని చూసి భయపడేది లేదు. మేము తెరాసలోనే ఉంటాము. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకోవడం లేదు,” అని చెప్పారు. 

కానీ టికెట్ల కేటాయింపులను బట్టే ఎవరు ఏ పార్టీలో కొనసాగుతారు...ఏ పార్టీలోకి మారుతారనే విషయంపై స్పష్టత రాదు. దానికి ఇంకా చాలా సమయం ఉంది కనుక కొండా దంపతులు చెప్పింది నిజమే అనుకోకతప్పదు. 


Related Post