ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు తధ్యం: కేటిఆర్

April 24, 2018


img

సిపిఎం మహాసభల సందర్భంగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అసాధ్యమని చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటిఆర్ స్పందిస్తూ, “దేశంలో ఎవరు అవునన్నాకాదన్నా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు తధ్యం. కెసిఆర్ ఆలోచనాశక్తి, మేధోపటిమకు అనుగుణంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటవుతుంది. సిపిఎం వద్దంటే తెలంగాణా  ఏర్పాటు ఆగిందా? అలాగే ఇది కూడాను,” అని అన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటు చేయబోతున్న ఫ్రంట్ పేరు ధర్డ్ ఫ్రంటా లేక ఫెడరల్ ఫ్రంటా లేక ప్రజాఫ్రంటా? అనే దానిపై స్పష్టత ఇస్తే బాగుంటుంది. సిఎం కెసిఆర్ ఫ్రంట్ ప్రతిపాదన చేసి, దాని ఏర్పాటుకు చొరవ తీసుకొంటున్నమాట వాస్తవం. కనుక అయన ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగానే దానిని ఏర్పాటు చేయాలనుకోవడం సహజం. కానీ అనేక పార్టీలతో ఏర్పాటు కాబోయే ఫ్రంట్ లో కెసిఆర్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. దాని ఏర్పాటు చేయడం వరకు కెసిఆర్ ఎంతైనా కృషి చేయగలరు. కానీ ఒకసారి ఏర్పాటు అయిన తరువాత దానిలో భాగస్వామి పార్టీలన్నీ ఫ్రంట్ పై పెత్తనం చేయాలని కోరుకోవడం తధ్యం. అందుకే సమిష్టి నిర్ణయాల మేరకే ఫ్రంట్ పనిచేస్తుందని కెసిఆర్ ముందే చెప్పారు. ఇక ఫ్రంట్ ఏర్పాటు చేయడం, దానిలో భాగస్వాములను కలిపి ఉంచడం, కాంగ్రెస్, భాజపాలను డ్డీ కొని విజయం సాధించడం అన్నీ చాలా క్లిష్టమైనవే. గతంలో చేసిన ఇటువంటి ప్రయోగాలు విఫలం అయినందున ఇప్పుడు కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ఫ్రంట్ పై తెరాస నేతలు తప్ప ఇతర పార్టీలు ఏవీ పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. బహుశః అందుకే సీతారాం ఏచూరి ఆవిధంగా అని ఉండవచ్చు. కానీ ఫ్రంట్ ఏర్పాటుచేసి వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్, భాజపాలను ఓడించగలిగితే నిసందేహంగా ఆ క్రెడిట్ కెసిఆర్ కే చెందుతుంది.     



Related Post